ప్రభుత్వ కానుక.. నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
Bathukamma sarees to be distributed from today.తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
By తోట వంశీ కుమార్ Published on 2 Oct 2021 10:50 AM ISTతెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలను 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇక బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం.. ప్రతి ఏటా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నసంగతి తెలిసిందే. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. చీరల పంపిణీ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే చీరలు అన్ని జిల్లాలకు చేరుకుగా.. అక్కడి నుంచి గ్రామ, వార్డు స్థాయి కేంద్రాలకు చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకు చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
18 ఏళ్లు పైబడి రేషన్ కార్డులో పేరు నమోదైన వారికి చీరలను పంపిణీ చేయనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.333.14కోట్లను ఖర్చు చేసింది. 19 రంగులు, 17 డిజైన్లతో మొత్తం 290 వర్ణాలలో చీరలను తయారు చేయించారు. డాబీ అంచు చీరలు బతుకమ్మ పండుగకు ప్రత్యేకతను తీసుకురానుంది. మొత్తం 810 రకాల చీరలను 1.08 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేయనున్నారు. చీరల ప్యాకింగ్‌ను కూడా ఆకర్షణీయంగా జాగ్రత్తలు తీసుకున్నారు. చీరల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పోరేషన్ డివిజన్ల వారీగా రేషన్ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. చీరల పంపిణీలో సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరని.. కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.