Telangana: వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన మహిళా సబ్‌ కలెక్టర్‌

కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు.

By -  అంజి
Published on : 20 March 2026 11:02 AM IST

Kamareddy Water Tank Incident, Sub-Collector Kiranmayi, Intermediate Student Suicide Threat, Mobile Phone Addiction Conflict, Emotional Counseling, Banswada Administration

Telangana: వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన మహిళా సబ్‌ కలెక్టర్‌

కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. సెల్ ఫోన్ అతిగా వాడుతున్నావని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని, 60 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు అంటే దాదాపు తొమ్మిదిన్నర గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహమ్మద్ నగర్ మండలం బుర్గుల్ గ్రామానికి చెందిన శ్రవంతి, ఇందల్వాయి గురుకులంలో ఇంటర్మీడియట్ చదువుతోంది.

ఇటీవల మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటి వద్ద ఉంటోంది. ఇంట్లో ఉన్న సమయంలో ఆమె నిరంతరం మొబైల్ ఫోన్‌తో గడుపుతుండటంతో బుధవారం రాత్రి తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో తీవ్ర కలత చెందిన ఆమె, గురువారం ఉదయం గ్రామంలోని వాటర్ ట్యాంక్ సగం వరకు ఎక్కి దూకేస్తానని కేకలు వేసింది. తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్ ఎంత బ్రతిమిలాడినా ఆమె వినలేదు. పోలీసులు అక్కడికి చేరుకోగానే మరింత ఆందోళనకు గురైన శ్రవంతి, ట్యాంక్ పైకి ఎక్కి కూర్చుంది. సమయం గడుస్తున్న కొద్దీ అక్కడ ఉద్రిక్తత పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి చేరుకున్నారు.

పరిస్థితిని గమనించిన ఆమె, నేరుగా తానే వాటర్ ట్యాంక్ మెట్లు ఎక్కుతూ ఆ అమ్మాయితో మాటలు కలిపారు. సబ్ కలెక్టర్ ఎంతో ఓపికతో శ్రవంతికి నచ్చజెప్పారు. ఇకపై తల్లిదండ్రులు నిన్ను మందలించరని, నీకు ఏ సమస్య ఉన్నా తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. కలెక్టర్ మాటలకు శాంతించిన శ్రవంతి, ఎట్టకేలకు కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కౌమార దశలో ఉన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు సున్నితంగా వ్యవహరించాలని, ఒత్తిడిలో ఉన్న వారికి మానసిక మద్దతు అవసరమని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

Next Story