యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్: బండ్ల గణేష్‌

Bandla Ganesh Praises On Cm Kcr After He Visits Yadadri Temple. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సేవలు దేశానికి ఎంతో అవసరమని నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌

By అంజి  Published on  14 Feb 2023 12:30 PM IST
యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్: బండ్ల గణేష్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సేవలు దేశానికి ఎంతో అవసరమని నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి వారిని దర్శించుకున్న తర్వాత బండ్ల గణేష్‌ వరుస ట్వీట్లు చేశారు. ఎన్నో రోజుల నుంచి నరసింహ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్నా.. ఆ స్వామివారి అనుగ్రహం లేక తనకు రావటం కుదరలేదని, కానీ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి ఆ యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి కేసీఆర్‌కి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక కతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ అద్భుతమైన ప్రగతి పథం వైపు దూసుకుపోతుంది అని చెప్పటానికి ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ఓ నిదర్శనం అని పేర్కొన్నారు. కేసీఆర్ ఆలోచన, ఆచరణ ఇవే కాకుండా, నిర్మిస్తున్న ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానంతో మహా అద్భుతంగా తృప్తి చెందానని, చాలా సంతోషం అనిపించిందన్నారు. ముఖ్యమంత్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతున్నానని బండ్ల గణేష్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

యాదగిరి నరసింహస్వామి ఆలయం చూశాక.. కేసీఆర్‌కు ఈ రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతి పథం వైపు నడిపించే సత్తా, సామర్థ్యత ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నానని చెప్పారు. మదిలో వచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, మదిలో వచ్చిన ప్రతి ఆలోచనని ఆచరణలో పెట్టి ప్రజలకు అందించాలన్న కేసీఆర్ సంకల్పం చాలా గొప్పదన్నారు. ఆనందంగా, చురుగ్గా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రానికే గాక భారతదేశం మొత్తానికి కేసీఆర్‌ తన అమూల్యమైన సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

ఈరోజు భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రమైన మన తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో కేసీఆర్‌ ఆలోచన విధానం, కఠోర తపస్సు, ముక్కుసూటితనం ఎంతో ఉపయోగపడిందన్నారు. నరసింహస్వామిని చూసిన తర్వాత ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు కేసీఆర్‌పై ఉండాలని, ఎల్లవేళలా ఆ స్వామివారి ఆశీస్సులు కేసీఆర్‌ మీద ఉండాలని, ప్రజలందరి పైన ఉండాలని కోరుకుంటున్నానని బండ్ల గణేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ''ఏ స్వార్థం కోసమో.. ఏ లబ్ధి కోసమో మీ దగ్గర ఏది ఆశించో నేను చెప్పట్లేదు. నా మనసులోని మాటలు చెప్తున్నాను. మంచి చేస్తే మంచి అని చెప్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను. అది నా నైజం సార్..! మీరు అద్భుతం, యువర్ ఏ వండర్ ఫుల్, యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా.. లవ్ యు కేసీఆర్'' అంటూ ట్వీట్ చేశారు.

Next Story