'మేం ఈడీని వాడితే వాళ్లు జైలుకు పోయేవారు'.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay's sensational comments on TRS government. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎ
By అంజి Published on 14 Aug 2022 3:27 PM ISTబీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లైసెన్స్‌డ్ గూండాల్లా మారిపోయాన్నారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్ళీ వచ్చిందా అనిపిస్తోందని విమర్శించారు. తాము ఈడీని వాడుకోని ఉంటే.. రాష్ట్రంలో ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలకుండా, అంతా జైలుకు పోయే వారని సంజయ్ వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలు, హత్యలు, ఇసుక, డ్రగ్స్ మాఫియాలకు టీఆర్‌ఎస్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆక్షేపించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రాష్ట్ర సర్కార్‌కు.. ప్రభుత్వ బడుల్లో చాక్‌పీసులకు కూడా డబ్బులిచ్చే పరిస్థితి లేదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పిల్లలకు చాకెట్లు పంచడానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదని అన్నారు. మోత్కూర్‌లోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద ఇవాళ ఉదయం బండి సంజయ్ మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చాలాసార్లు చర్చలు జరిపానని, కానీ తమ మధ్య రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనతో టచ్‌లో ఉన్నాడని తానెప్పుడూ అనలేదని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా మంచి పొలిటికల్ లీడర్ బండి సంజయ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు ఖాయం ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆరెస్ పార్టీలు ఉప ఎన్నికకు ముందే పారిపోయాయన్నారు. కమ్యూనిస్టులు అమ్ముడుపోయే పార్టీలని, ఈ సారి ఎటువైపు పోతారో చూడాలన్నారు. అయినా కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎటువైపు పోతారో వారికే తెలియదు. కమ్యూనిస్టు పార్టీల్లో కార్యకర్తలు మంచోళ్లు.. లీడర్లు అమ్ముడుపోయేటోళ్లని సంజయ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ఇక కేసీఆర్ బొమ్మ పెట్టుకుని తిరిగితే ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు భయపడే పెన్షన్‌లు, చేనేత బీమా, ఇతర పథకాలు ప్రభుత్వం ప్రకటిస్తోందన్నారు. చేనేత బీమా ప్రకటించకపోతే ప్రగతి భవన్ గడీలు బద్దలు కొడతామని తాము హెచ్చరిస్తే భయపడి చేనేత బీమా ప్రకటించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొందరు అధికారులు, పోలీసులు టీఆర్ఎస్‌కు తొత్తులుగా మారారని.. బీజేపీ అధికారం లోకి వచ్చాక వాళ్ళ సంగతి చూస్తామని సంజయ్ అన్నారు.