ఇదేం పాలన రేవంత్? కేఏ.పాల్‌కు అప్పగించినా అదే చేస్తారు కదా?: బండి సంజయ్

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు.

By Knakam Karthik
Published on : 31 March 2025 3:46 PM IST

Telanagana, Bandi Sanjay, Cm Revanthreddy, Kanche Gachibowli Land

ఇదేం పాలన రేవంత్? కేఏ.పాల్‌కు అప్పగించినా అదే చేస్తారు కదా?: బండి సంజయ్

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ‘ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే... వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలని చూడకుండా జుట్టుపట్టుకుని గుంజుకుపోయి చితకబాదుతారా? ఇదేం పద్దతి? భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములన్ని వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? అంత మాత్రాన మీరెందుకు...కేఏ పాల్ కు అప్పగించినా అదే పని చేస్తారు కదా?‘‘అంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఏకమయ్యాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమై ఆ పార్టీకి సహాయం చేస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు ఉన్నా సరే వారికి ఎంఐఎంతో ఉన్న అనుబంధం కారణంగా పోటీ చేయడం లేదన్నారు. ఎంతమంది ఏకమైనా బీజేపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ సన్నబియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కాని అందులో కేంద్రానికి కూడా వాటా ఉందని, ప్రతి కిలోకు రూ.40 చొప్పున కేంద్రం భరిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏడాదికి రూ.10 వేల కోట్లు ఇస్తోందని.. ఈ విషయాన్ని ఎక్కడైనా తాను నిరూపించేందుకు సిద్ధం అని సవాల్ విసిరారు. ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. నిరుద్యోగ అభ్యర్థులకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందని, గ్రూప్ 1 అభ్యర్థుల అనుమానాలు తీర్చకముందే ఫలితాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఏదో హడావిడిగా నియామక పత్రాలు అందజేసి గొప్పలు చెప్పుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు.

Next Story