ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనందయ్య మందు గురించి బయటకు పొక్కగానే.. ఇంగ్లీష్ మందులు కాకుండా.. ఆయుర్వేదం నాటు మందుల వైపు కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి. తాజాగా తెలంగాణలో కూడా మరో ఆనందయ్య వచ్చాడు అనే వార్త వైరల్ అవుతూ ఉంది. ఈయన ఓ సింగరేణి రిటైర్డ్ కార్మికుడని చెబుతున్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రానికి చెందిన బచ్చలి భీమయ్య గతంలో సింగరేణిలో పనిచేశారు. ఆయన పూర్వీకులు ఆయుర్వేద మందులు తయారుచేసి స్థానికులకు వైద్యం చేసేవారు. వారి నుంచి వైద్యం నేర్చుకున్న భీమయ్య ఇప్పుడు కరోనాకు కూడా మందు తయారుచేశారని అంటున్నారు. ఆనందయ్యకు తీసిపోని విధంగా కరోనా వచ్చిన వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా మందికి నయం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
బచ్చలి భీమయ్య ఇప్పటి వరకు 100 మందికి పైగా ఆయుర్వేద మందును ఇచ్చినట్లు పేర్కొన్నారు. రోజు రోజుకూ ఆయన వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో మందమర్రి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని, విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏ విధంగా మందును పంపిణీ చేస్తున్నారంటూ ఆరా తీస్తున్నారు. భీమయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే కరోనా పేషెంట్లకు ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తానని భీమయ్య కూడా చెబుతున్నారు.