టీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి చందూలాల్ క‌న్నుమూత‌.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Azmira chandulala passes away.టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ క‌న్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 April 2021 7:39 AM IST
Azmira chandulala

టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లోని కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డంతో తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 67 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు భార్య‌, ముగ్గురు కుమారులు, ఒక కుమారై ఉన్నారు. ‌చందూలాల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గిరిజన ప్రజల సమస్యలకోసం ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. చందూలాల్‌ మృతిపట్ల రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం తెలిపారు. చందూలాల్‌ పార్థివ దేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

"మాజీ మంత్రివర్యులు శ్రీ అజ్మీరా చందూలాల్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని మరో మంత్రి ఈటల రాజేందర్ తన ట్విట్టర్ ఖాతాలో సంతాపం తెలిపారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు (ప్రస్తుతం ములుగు జిల్లా) మండలం జగ్గన్నపేటలో 1954 ఆగ‌స్టు 17న జ‌న్మించారు. గిరిజన విద్యార్థి నాయకుడిగా, స్పెషల్‌ టీచర్‌గా ఉద్యోగం పొంది గిరిజనుల్లో విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. రాజకీయాల పట్ల ఆకర్షితుడై టీడీపీలో చేరారు. తన సొంత ఊరుకు సర్పంచ్‌గా పనిచేసి అనతి కాలంలోనే జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా ప‌నిచేశారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్టీఆర్ హ‌యాంలో, తెలంగాణ‌లో కేసీఆర్ హ‌యాంలో రెండు సార్లు మంత్రిగా ప‌నిచేశారు. 1996, 98ల‌లో లోక్‌స‌భ స‌భ్యునిగా గెలుపొందారు. 2005లో టీఆర్ఎస్‌లో చేరారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యునిగా ప‌నిచేశారు.




Next Story