Video: ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఓవైసీ

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లేదా కాంగ్రెస్‌కు ఓటేస్తే, అప్పుడు వారి సమస్యలను చూసుకోవడానికి ఎవరూ ఉండరని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

By అంజి  Published on  28 Oct 2023 10:27 AM IST
Asaduddin Owaisi, regional parties, Telangana Polls

Video: ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఓవైసీ  

హైదరాబాద్: రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లేదా కాంగ్రెస్‌కు ఓటేస్తే, అప్పుడు వారి సమస్యలను చూసుకోవడానికి ఎవరూ ఉండరని ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఒక సభలో అన్నారు. తెలంగాణలోని జహీరాబాద్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రాంతీయ పార్టీలు (అధికారంలో) ఉన్నచోట, ప్రజలకు విలువ ఉంటుంది. వారిద్దరూ (బీజేపీ, కాంగ్రెస్‌) అధికారంలోకి వస్తే మీ సమస్యలను చూసే వారు ఎవరూ ఉండరు' అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ ప్రజల ముందు ఏం చెప్పాలో అది అసదుద్దీన్ ఒవైసీ రాసి ఇస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ఆరోపించారు. ఏఐఎంఐం.. కాంగ్రెస్,బీఆర్‌ఎస్‌లకు ఏ-టీమ్ అని కూడా ఆయన అన్నారు. ''ఏఐఎంఐం.. కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితిల ఏ-టీమ్. అసదుద్దీన్ ఒవైసీ వాటన్నింటినీ నియంత్రిస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ కేసీఆర్, రాహుల్ గాంధీ ఏం చెప్పాలో రాసి ఇస్తున్నారు. బీఆర్‌ఎస్‌ మజ్లిస్ (AIMIM) పార్టీతో ఉంది. మాకు ప్రాణం ఉన్నంత వరకు ఏఐఎంఐఎంతో కలిసి వెళ్లం. ఏఐఎంఐంతో కలిసి ఉన్న బీఆర్‌ఎస్‌తో మేం ఎప్పటికీ జతకట్టం'' అని అన్నారు.

తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌లు ప్రధాన పోటీదారులుగా త్రిముఖ పోటీకి సిద్ధమయ్యాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో బీఆర్‌ఎస్ 47.4 శాతం ఓట్లను సాధించింది. కాంగ్రెస్ 19 సీట్లు, 28.7 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.

నవంబర్ 7న మిజోరం, నవంబర్ 7, 17న ఛత్తీస్‌గఢ్, నవంబర్ 17న మధ్యప్రదేశ్, నవంబర్ 25న రాజస్థాన్, 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల తేదీల ప్రకటనతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు చాలా కీలకం.

Next Story