ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదం.. తెలంగాణకు చెందిన పైలట్‌ వినయ్‌ భానురెడ్డి మృతి

అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరిలో తెలంగాణకు చెందిన ఆర్మీ పైలట్‌ ఒకరు.

By అంజి  Published on  17 March 2023 7:11 AM GMT
Army helicopter crash, Malkajgiri, Telangana Army Pilot

ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదం.. తెలంగాణకు చెందిన పైలట్‌ వినయ్‌ భానురెడ్డి మృతి

హైదరాబాద్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరిలో తెలంగాణకు చెందిన ఆర్మీ పైలట్‌ ఒకరు. మృతి చెందిన వారిని లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ జయంత్ ఎగా గుర్తించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రయాణ సమయంలో వారి హెలికాప్టర్ కుప్పకూలడంతో వారు వీరమరణం పొందారు.

హైదరాబాద్‌కు చెందిన వుప్పల వినయ్ భాను రెడ్డి మల్కాజిగిరిలో పాఠశాల విద్యను అభ్యసించారు. తరువాత అతను 17 సంవత్సరాల వయస్సులో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాడు. హైదరాబాద్‌లోని దుండిగల్, హకీంపేటలో శిక్షణ పొందిన తరువాత.. 35 ఏళ్ల అతను హెలికాప్టర్ పైలట్‌గా మారాడు.

"గత నెలలో అతను ఒక వివాహానికి హాజరు కావడానికి హైదరాబాద్‌కు వచ్చాడు. మేము షాక్‌లో ఉన్నాము. అతని వృద్ధ తల్లిదండ్రులు అతను చనిపోవడాన్ని అంగీకరించలేరు. అతను చిన్న వయస్సులోనే ఐఏఎఫ్‌లో చేరాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో దాదాపు 23 సంవత్సరాలు పూర్తి చేశాడు" అని వినయ్‌ భానురెడ్డి మామ మధు సుధా రెడ్డి తెలిపారు.

అతని భార్య స్పందన రెడ్డి పూణే మిలిటరీ హాస్పిటల్‌లో డాక్టర్, ఆమె ఇండియన్ ఆర్మీలో కూడా పనిచేస్తున్నారు. అతనికి నాలుగు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మార్చి 16న ఉదయం 9:15 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమ్‌డిలా సమీపంలో రోజువారీ విధుల్లో భాగంగా వెళ్తున్నప్పుడు ఆర్మీ ఏవియేషన్ చీత్‌ హెలికాప్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాన్ని కోల్పోయింది. భారత సైన్యం, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీకి చెందిన ఐదు సెర్చ్ పార్టీలు వెంటనే గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే అందరినీ షాక్‌కు గురిచేసే విధంగా మండలానికి తూర్పున ఉన్న బంగ్లాజాప్ గ్రామ సమీపంలో విమాన శకలాలు కనుగొనబడ్డాయి.

"ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని పైలట్, కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారని విచారంతో మీకు తెలియజేస్తున్నాము. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించబడుతోంది" అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి తన కుటుంబంతో సహా.

లెఫ్టినెంట్ కల్నల్ వివిబి రెడ్డి కుటుంబ సభ్యుడు న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ.. ''వారు ఉదయం ఆపరేషనల్‌ విమానంలో ఉండగా వారి హెలికాప్టర్ కూలిపోయింది. మార్చి 16 మధ్యాహ్నం 12.30 గంటలకు మాకు సమాచారం అందింది. అయితే, వివిబి రెడ్డికి సంబంధించి ఎటువంటి సమాచారం పంచుకోలేదు. ప్రస్తుతం మృతదేహాన్ని అస్సాం రెజిమెంట్‌లో ఉంచారు. తర్వాత మృతదేహాన్ని బేగంపేట విమానాశ్రయానికి తరలించనున్నారు'' అని తెలిపారు.

Next Story