కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా కొన్ని రోజుల కిందట సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అల్లర్ల కేసులో ఆర్మీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్మీ అభ్యర్థుల తరఫున టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆర్మీ అభ్యర్థులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అలాగే రూ.20 వేలు, రెండు షూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా కేంద్రప్రభుత్వం అగ్నిపథ్ అనే కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆర్మీర్యాలీల్లో అర్హత సాధించి, వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ కొత్త స్కీమ్‌ను ప్రకటించడంతో అభ్యర్థులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బోగీలకు నిప్పుపెట్టి, రైల్వే ఆస్తులను ఆర్మీ అభ్యర్థుల నష్టపరిచారు.
రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పరిస్థితిని అదుపు తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత వారిని రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ క్రమంలోనే ఆర్మీ అభ్యర్థుల కోసం రేవంత్ రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.