ఎంజీఎంలో అమానుషం: మృతదేహానికి స్ట్రెచర్ నిరాకరణ.. చేతులపైనే మోసుకెళ్లారు (VIDEO)

పేదల పెద్దాస్పత్రిగా పేరుగాంచిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి మానవత్వం మంటగలిసింది.

By -  అంజి
Published on : 14 Feb 2026 1:36 PM IST

Warangal MGM Hospital Negligence, Dead Body Stretcher Issue, Khammam Man Death MGM, Telangana Health News, MGM Hospital Staff Apathy, Warangal News

ఎంజీఎంలో అమానుషం: మృతదేహానికి స్ట్రెచర్ నిరాకరణ.. చేతులపైనే మోసుకెళ్లారు (VIDEO)

పేదల పెద్దాస్పత్రిగా పేరుగాంచిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మరోసారి మానవత్వం మంటగలిసింది. ప్రాణాలు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక కుటుంబం పట్ల ఆస్పత్రి సిబ్బంది అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. కనీసం మృతదేహాన్ని అంబులెన్స్ వరకు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ కూడా ఇవ్వకపోవడంతో, మృతుడి బంధువులు శవాన్ని చేతులపైనే మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఖమ్మం జిల్లాకు చెందిన కాంతారావు అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కాంతారావు శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి మృతి చెందారు. కాంతారావు మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేసుకున్నారు. అయితే, వార్డు నుంచి బయట ఉన్న అంబులెన్స్ వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సహకరించాలని ఆస్పత్రి సిబ్బందిని కోరారు. కనీసం ఒక స్ట్రెచర్ లేదా వీల్ ఛైర్ ఇవ్వాలని వేడుకున్నా, అక్కడి సిబ్బంది కనికరం చూపలేదు. "స్ట్రెచర్లు ఖాళీగా లేవు.. మేమేమీ చేయలేం" అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు.

చివరికి చేసేదేమీ లేక, తమ ప్రియతమ వ్యక్తి మృతదేహాన్ని ఆస్పత్రి వార్డు నుంచి పార్కింగ్ ఏరియాలో ఉన్న అంబులెన్స్ వరకు కుటుంబ సభ్యులే చేతులపై మోసుకెళ్లారు. ఆస్పత్రి ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటన అక్కడి వారిని కలచివేసింది. ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ స్ట్రెచర్లు లేక రోగులను భుజాలపై మోసుకెళ్లిన ఘటనలు అనేకసార్లు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా, క్షేత్రస్థాయిలో సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంతారావు మృతదేహం పట్ల అమానుషంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story