అగ్నిప‌థ్ పై ఆందోళ‌న‌లు.. నిరుద్యోగ సంక్షోభానికి సూచిక : మంత్రి కేటీఆర్‌

Anti Agnipath stir indicator of unemployment crisis in india says KTR.ఆర్మీలో స్వల్పకాలిక ‍సర్వీసుల పేరుతో వచ్చిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2022 12:40 PM IST
అగ్నిప‌థ్ పై ఆందోళ‌న‌లు.. నిరుద్యోగ సంక్షోభానికి సూచిక : మంత్రి కేటీఆర్‌

ఆర్మీలో స్వల్పకాలిక ‍సర్వీసుల పేరుతో వచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో రైల్వే స్టేష‌న్ల‌లో ఆందోళ‌న కారులు ప‌లు రైళ్ల‌కు, బ‌స్సుల‌కు నిప్పుపెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు వంద‌ల కోట్ల ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న‌ల‌పై మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. కేంద్ర‌ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా మంత్రి అభివ‌ర్ణించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్‌లతో పెట్టుకున్నారని అని అన్నారు.

'అగ్నివీర్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. మొద‌ట అన్న‌దాల‌తో పెట్టుకున్నారు. ఇప్పుడేమో దేశ జ‌వాన్ల‌తో పెట్టుకుంటున్నారు. మొన్న వన్ ర్యాంక్ - వన్ పెన్షన్ విధానం.. నేడు నో ర్యాంక్ - నో పెన్షన్ అనే ప్ర‌తిపాద‌న అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. 'అగ్నిపథ్' స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భగ్గుమంది. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెలుపల ఉన్న బస్సులను ధ్వంసం చేశారు. అక్కడికి పోలీసులు వచ్చి చేరడంతో పరుగున రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి అక్కడి రైళ్లను ధ్వంసం చేశారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింది. ఈ కాల్పుల్లో ఒక‌రు మృతి చెంద‌గా.. ప‌లువురు గాయ‌ప‌డ్డారు.

Next Story