గుడ్‌న్యూస్‌.. ఈనెల చివర్లో మరో రెండు గ్యారెంటీల అమలు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది.

By Srikanth Gundamalla
Published on : 22 Feb 2024 5:31 PM IST

two guarantees, implementation, cm revanth reddy,

 గుడ్‌న్యూస్‌.. ఈనెల చివర్లో మరో రెండు గ్యారెంటీల అమలు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్న సర్కార్‌.. మరో రెండు గ్యారెంటీలను ఈ నెల చివర్లో అమలు చేయాలని భావిస్తోంది. గృహలక్ష్మీ, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాల అమలుకు వెంటనే సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28న లేదా 29వ తేదీన రెండు పథకాలను ప్రారంభించాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేస్తున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

కాగా.. గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కేబినెట్‌ సబ్‌ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పలువురు మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించే మహాలక్ష్మీ, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు ఇప్పటికే అమలు చేస్తోంది. ఇప్పుడు గృహలక్ష్మీ, గ్యాస్‌సిలిండర్‌ను రూ.500కే ఇచ్చేందుకు సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ మేరకు పథకాల అమలుపై ఏర్పాట్లు, అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు.

గ్యాస్ సిలిండర్‌ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన సిబ్సిడీ నిధులను వెంట వెంటనే చెల్లించేందుకు ఏర్పాటు చేయాలని చెప్పారు. అనుమానాలు అపోహలకు తావు లేకుండా గృహలక్ష్మి పథకాన్ని పాదర్శకంగా అమలు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సీఎం సూచిచంఆరు. తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్‌ వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్‌ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారికి గృహలక్ష్మి కింద జీరో బిల్లులు జారీ చేయాలని ఆదేశించారు.

ఇక ప్రజాపాలన దరఖాస్తుల్లో కార్డు నెంబర్లు, కనెక్షన్ నెంబర్లను తప్పుగా ఇవ్వడం ద్వారా అర్హత కోల్పోతే వారికి సవరించుకునే అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇక ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఎంపీడీవో, తహసీల్దార్‌ ఆఫీసుల్లో అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియగా సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో చెప్పారు.

Next Story