నిర్మల్ జిల్లా భైంసాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా మహమ్మారి బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 25 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. వీరితో కలుపుకుని పాజిటివ్‌గా నిర్థారణ అయిన విద్యార్థుల సంఖ్య 35 కి చేరింది. మహాత్మాజ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో గురువారం 176 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 25 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. బుధవారం ఇదే పాఠశాలకు చెందిన 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. కాగా.. ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పాఠశాల్లో మిగిలిన 140 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 59,905 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 278 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,02,047కి చేరింది. నిన్న కొవిడ్‌తో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,662కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 111 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,98,120కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,265 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 94,19,677కి చేరింది.