కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. కొన్ని రకాల అలర్జీలు ఉన్న వాళ్లు వ్యాకిన్లకు దూరంగా ఉండడం మంచిదని చెప్పుకుంటూ వచ్చారు. ఇక టీకా తీసుకున్న తరువాత కొందరు స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు. అందుకనే టీకా తీసుకున్న 30 నిమిషాల వరకు అక్కడే ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ అంగన్‌వాడీ కార్యకర్త తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఆయా సుశీల(50) ఈ నెల 19న మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆమె అస్వస్థతకు గురైంది. దీంతో ఈనెల 28న ఆస్పత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో.. శనివారం హైదరాబాద్‌లోని నిమ్స్ కు తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించింది. సుశీలకు దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం వల్లనే ఇబ్బంది కలిగి ఉంటుందని మెడికల్ ఆఫీసర్ కిరణ్మయి చెప్పారు. దీనిపై ఇంకా వైద్యాధికారులు స్పందించలేదు.