Telangana: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు

గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడ్డారు.

By Srikanth Gundamalla  Published on  2 Feb 2024 7:45 AM GMT
andhra pradesh, two constable, caught,  ganja smuggling,

Telangana: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆంధ్రా పోలీసులు

తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటుంటే.. మరోవైపు స్మగ్లర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వివిధ మార్గాల్లో తెలంగాణకు డ్రగ్స్, గంజాయిని తరలిస్తూనే ఉన్నారు. తాజాగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి భారీగా గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.

శుక్రవారం బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు ప్రయత్నిస్తున్నారన్న సమచారం ఎస్‌వోటీ బాలానగర్‌ పోలీసులు అందుకున్నారు. ఈమేరకు వారు ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. AP 39 QH 1763 నెంబర్ గల మారుతీ వాహనంలో 11 ప్యాకెట్స్‌లో 22 కిలోల గంజాయిని గుర్తించారు పోలీసులు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ.8 లక్షలు ఉంటుంది పోలీసులు చెబుతున్నారు. అయితే.. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిని విచారించగా సంచలన విషయలు బయటపడ్డాయని పోలీసులు చెప్పారు. పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసులుగా గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప.గో జిల్లా కాకినాడ థర్డ్‌ బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన హెడ్‌ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ (35), కానిస్టేబుల్ శ్రీనివాస్ (32) అని తెలిపారు. గంజాయి స్మగ్లింగ్‌ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతోనే ఖాకీలు ఈ దందాకు దిగారని సమాచారం. అయితే.. నిందితులు ఆరోగ్యం బాగోలేదని డ్యూటీకి సెలవు పెట్టి మరీ ఈ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. కానీ చివరకు వారు ఊహించని విధంగా పోలీసులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం వారిని తెలంగాణ పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రజలు.. పోలీసులే ఇలా నేరాలకు పాల్పడుతుంటే ఎలా అంటున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ జరిగిన అనంతరం ఇద్దరు కానిస్టేబు ళ్లను రిమాండ్ కి తరలించారు.


Next Story