యాదాద్రి వెనుక.. ఆనంద్ సాయి

Anand Sai from film set designer to Yadagirigutta Temple Architect.యాదగిరిగుట్ట రూపురేఖలు ఇప్పుడు చాలా మారిపోయాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 March 2022 2:27 PM IST
యాదాద్రి వెనుక.. ఆనంద్ సాయి

యాదగిరిగుట్ట రూపురేఖలు ఇప్పుడు చాలా మారిపోయాయి. ఆలయం 17 ఎకరాల విస్తీర్ణంలో.. ఏడు గోపురాలతో మూడంతస్తుల ఎత్తులో నిర్మించబడింది. 1000 సంవత్సరాల నాటి గుడిని మార్చకుండా కొత్త ఆలయాన్ని నిర్మించారు. శిల్పాలను చెక్కడానికి కృష్ణశిల ​​శిలలను మాత్రమే ఉపయోగించారు. 2.5 లక్షల టన్నుల బరువున్న రాళ్లను తవ్వి ఏళ్ల తరబడి యాదిగిరిగుట్టకు తరలిస్తున్నారు. ఆలయంలో పొరల్లో ఒక్క ఔన్స్ సిమెంట్ కూడా ఉపయోగించలేదు. సిమెంటుకు బదులు సున్నం వాడారు. ఆలయ నిర్మాణానికి సంప్రదాయ నిర్మాణ పద్ధతులను ఉపయోగించారు.

ఇక ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ముఖ్యమైన వ్యక్తి ఆనంద్ సాయి. కొత్తగా నిర్మించిన యాదగిరిగుట్ట ఆలయ ప్రధాన ఆర్కిటెక్ట్ గా ఆయన ఉన్నారు. గత ఆరేళ్లుగా ఆనంద్ సాయి ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్నారు. "నన్ను ఈ ప్రాజెక్ట్‌కి ఎందుకు ఎంచుకున్నారని నేను అడగ్గా, వాస్తుకు అనుగుణంగా సినిమా సెట్‌లను రూపొందించడం తనను ఆకట్టుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ చెప్పారు" అని ఆనంద్ న్యూస్‌మీటర్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆలయ వాస్తుపై తనకున్న అపారమైన పరిజ్ఞానం కూడా ఈ ప్రాజెక్ట్‌కి ఎంపిక కావడానికి మరో కారణమని ఆయన భావిస్తున్నారు. ఆనంద్ సాయి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'యమదొంగ', 'సైనికుడు', 'పులి', 'బృందావనం', 'నాని', 'గుడుంబా శంకర్‌' సహా పలు తెలుగు చిత్రాలకు ఆయన సెట్‌లు డిజైన్ చేశారు. 2016 నుంచి యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి తన పూర్తి సమయాన్ని వెచ్చించారు.


న్యూస్‌మీటర్‌తో సంభాషణలో ఆనంద్ సాయి మాట్లాడుతూ "ఈ ప్రాజెక్ట్ తన బిడ్డ లాంటిదని, ఇప్పుడు అది పూర్తవుతోంది. ఈ స్థలంతోనూ, గుడిలోని ప్రతి రాతితోనూ నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది'' అని ఆయన చెప్పారు. ఆనంద్ సాయి దక్షిణ భారతదేశంలోని అనేక దేవాలయాలను సందర్శించారు. యాదగిరిగుట్ట కోసం వాటి నుండి ప్రేరణ పొందారు. "పాత, అసలు ఆలయాన్ని తాకలేదు. స్వయంభూ (అసలు ఆలయ మైదానం) మరియు గర్భగుడి (ప్రధాన ఆలయం) అలాగే ఉన్నాయి" అని ఆయన చెప్పారు. హనుమాన్ విగ్రహం, ప్రధాన దేవాలయంలోని ఇతర భాగాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. దాని చుట్టూ కొత్త ఆలయాన్ని నిర్మించారు. తాను ద్రావిడ వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొందానని ఆనంద్ వివరించారు. తిరుచిరాపల్లిలోని శ్రీరంగం ఆలయ స్ఫూర్తితో ఈ ఏడు గోపురాలు నిర్మించబడ్డాయని అన్నారు. ఆలయానికి రెండు వైపులా నాలుగు, మధ్యలో మూడు గోపురాలు ఉన్నాయి. రాజగోపురం (ఆలయ ద్వారం వద్ద ఉన్న పిరమిడ్ నిర్మాణం) ఏడు అంతస్తుల ఎత్తు మరియు 13,000 టన్నుల బరువున్న రాళ్లతో నిర్మించబడింది.


విశాలమైన వాస్తు మరియు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా, ఆలయానికి సంబంధించిన మరో ప్రత్యేకత క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. "యాదగిరిగుట్ట చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇంతకుముందు ఆలయ విస్తీర్ణం చాలా తక్కువ.. ఆలయ అభివృద్ధి ప్రారంభమైనప్పుడు, యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడమే ప్రాథమిక లక్ష్యం" అని ఆనంద్ వివరించారు. ఆలయ విస్తీర్ణాన్ని పెంచడమే కాకుండా ప్రజలకు దివ్యమైన అనుభూతిని అందించే విధంగా క్యూ లైన్లను రూపొందించామని తెలిపారు.


హనుమంతుడు, శ్రీ నరసింహ స్వామి.. ఇలా వివిధ దేవతల రూపాలు, అందమైన శిల్పాలను ప్రజలు ఇక్కడ చూడవచ్చు. ఎంతో గొప్పగా శిల్పులు చెక్కారు. శిల్పులందరూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చెందినవారు. "రాష్ట్రంలో మహమ్మారి వచ్చినా పని ఆగలేదు" అని ఆనంద్ గర్వంగా చెప్పారు. "మేము వారి బస, అందరికీ ఆహారం ఏర్పాటు చేసాము. కోవిడ్ -19 మహమ్మారి రెండు వేవ్ ల సమయంలో కార్మికులందరూ ఆలయ ప్రాంగణంలో వివిధ విగ్రహాలు, స్తంభాలు, మరెన్నో వాటిని చెక్కారు" అని ఆయన చెప్పారు. మహమ్మారి వలన కొంత పనిని మందగించినప్పటికీ, ఆలయ నిర్మాణం ఎప్పుడూ ఆగలేదు.


గర్భగుడి (ప్రధాన ఆలయం) వెలుపల కొత్తగా అభివృద్ధి చేయబడిన ప్రాంగణం ఇప్పుడు అనేక కోతులకు నిలయంగా ఉంది, ఇక్కడ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి కోతులు గుట్ట (కొండ)పై ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో మండుతున్న ఎండను తట్టుకునే విధంగా.. చల్లని కృష్ణ శిలా రాళ్లపై నిద్రపోతున్న కోతులను చూడవచ్చు. విమాన గోపురం (ఆలయం లోపల ఉన్న ప్రధాన గోపురం) సుమారు 12 కిలోల బరువున్న బంగారంతో కప్పబడి ఉంది. 56 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ప్రేరణ పొందింది. ఆలయ విస్తరణకు మొత్తం 1,200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. విమాన గోపురాన్ని బంగారంతో కప్పాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఇందుకోసం పలువురు భక్తుల నుంచి విరాళాలు కోరారు.


ఆలయంలో మరొక అద్భుతమైన లక్షణం దాని లైటింగ్. "ఆలయం చుట్టూ వేల సంఖ్యలో బల్బులు అమర్చారు. సూర్యాస్తమయం తర్వాత ఆలయం మొత్తం వెలిగిపోతుంది. ఆలయం 3-4 కిలోమీటర్ల దూరం వరకు కనిపించగలదు" అని ఆనంద్ సాయి వివరించారు.


అధికారులు, ప్రాజెక్ట్‌లో పనిచేసిన వందలాది మంది ఇతర వ్యక్తుల సహాయం లేకుండా ఆలయాన్ని నిర్మించడం సాధ్యం కాదని ఆనంద్ సాయి చెప్పారు."ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు అవసరమైన అన్ని వనరులను అందిస్తూ మద్దతు ఇచ్చారు, ఆయన తరచుగా ఆలయ పనులకు సంబంధించి నాతో మాట్లాడి కొన్ని డిజైన్లను సూచిస్తూ ఉంటారు. ఆయన నన్ను ఇన్స్పైర్ చేస్తుంటారు" అని ఆయన చెప్పారు.


"నేను చూసిన ప్రతిసారీ ఆలయం భిన్నంగా ఉంటుందని భావిస్తుంటాను. ప్రతిసారీ ఆలయ అందం భిన్నంగా ఉంటుంది. ఇది ప్రజలకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు. సినిమాల పని నుండి ఆలయ నిర్మాణం పనికి మారడం ఆనంద్ సాయికి అంత సులభం కాదు. ఆయన యాదగిరిగుట్ట దేవాలయంలో ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. ఆనంద్ సాయికి మళ్లీ సినిమాల్లో పని చేయడానికి అనేక ఆఫర్లు వచ్చాయి కానీ ఆయన చేయలేదు. అతను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎప్పుడు తిరిగి వస్తాడో లేదో ఖచ్చితంగా చెప్పడం లేదు. ఆలయ నిర్మాణాన్ని కొనసాగిస్తానని ఎంతో నమ్మకంగా తెలిపారు.





Next Story