కోతులకు భయపడి బావిలో దూకిన వృద్ధురాలు.. చివరికి..

కోతులకు భయపడిన ఓ వృద్ధురాలు.. ఏం చేయాలో తెలియక మంచి నీటి బావిలో దూకింది. ఆ తర్వాత గట్టిగా కేకలు వేసింది. వృద్ధురాలు కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించారు.

By అంజి  Published on  6 Aug 2023 4:09 AM GMT
old woman, well, monkeys, Rajanna Sirisilla district

కోతులకు భయపడి బావిలో దూకిన వృద్ధురాలు.. చివరికి..

కోతులకు భయపడిన ఓ వృద్ధురాలు.. ఏం చేయాలో తెలియక మంచి నీటి బావిలో దూకింది. ఆ తర్వాత గట్టిగా కేకలు వేసింది. వృద్ధురాలు కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించారు. బావిలోకి తాడు వేసి వృద్ధురాలిని రక్షించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంభీర్‌పూర్‌ రాజవ్వ అనే వృద్ధురాలు పెన్షన్‌ డబ్బులతో జీవనం కొనసాగిస్తూ ఇంట్లో ఒంటిరిగా ఉంటున్నది. శనివారం ఇంటి బయట ఉన్న రాజవ్వపైకి కోతుల మంద వచ్చింది. దీంతో ఏం చేయాలో తోచని ఆమె అక్కడే ఉన్న బావిలోకి దూకింది. బావిలో నీళ్ల వరకు వెళ్లి పక్కన ఉన్న రాయిపై నిలబడి రక్షించాలని కేకలు వేసింది. అక్కడే ఉన్న ఓ యువకుడు తాడు తీసుకుని బావిలోకి దిగి వృద్ధురాలి నడుముకు కట్టాడు.

తర్వాత స్థానికుల సాయంతో ఆమెను పైకి తీసుకువచ్చారు. వెంటనే స్థానిక వైద్యుడితో చికిత్స అందించారు. వృద్ధురాలు ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే కోతుల బెడద పెరిగిపోతోందని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే.. జయశంకర్ భూపాలప్లలి జిల్లా రేగొండ మండలం నాగుర్లపల్లి గ్రామానికి చెందిన శిరీష గతేడాది మే నెలలో కోతుల దాడితో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయింది. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో కోతులు ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి. రాత్రి, పగలు ఆహారం కోసం పంటపొలాలపై దండయాత్ర చేస్తున్నాయి. పండ్లు, కూరగాయలతో పాటు వరి, మొక్కజొన్న పంటలను పాడు చేస్తున్నాయి.

Next Story