ఈనెల 28న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణకు వస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 25 Dec 2023 2:21 PM ISTఈనెల 28న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గతంతో పోలిస్తే ఎక్కువ సీట్లు రావడమే కాదు.. ఓటింగ్ శాతం కూడా బాగా మెరుగుపడింది. దాంతో.. ఇప్పుడు అధిష్టానం లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్‌షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వరకు వెయ్యికి పైగా మంది నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశం వేదికగానే పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఇంకా ఎన్నుకోలేదు. దాంతో.. ఈనెల 28న అమిత్‌షా నేతృత్వంలోనే శాసనసభా పక్ష నేతను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాగా.. తెలంగాణలో పది పార్లమెంట్ స్థానాలను గెలవాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచిన ఊపుతో పార్లమెంట్‌లో కూడా సత్తా చూపెట్టాలని భావిస్తోంది.
మీడియా సమావేశంలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. కాంగ్రెస్ శ్వేతపత్రం, బీఆర్ఎస్ స్వేదపత్రం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రెండూ పార్టీలవి అవినీతి పత్రాలనే అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం తర్వాత.. అమిత్‌షా టూర్‌లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారని కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేఎల్పీ నేత ఎంపిక పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.