తెలంగాణలో డిసెంబర్ 3న బీజేపీ జెండా ఎగరాలి: అమిత్‌షా

ఆదిలాబాద్‌ జనగర్జన సభ ద్వారా డిసెంబర్‌ 3న తెలంగాణలో కాషాయ జెండా ఎగురాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.

By Srikanth Gundamalla  Published on  10 Oct 2023 11:53 AM GMT
amit shah, jana garjana sabha, BJP, adilabad,

తెలంగాణలో డిసెంబర్ 3న బీజేపీ జెండా ఎగరాలి: అమిత్‌షా

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమలోనే బీజేపీ, బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించేందుకు ఆదిలాబాద్‌ చేరుకున్నారు. ఆదిలాబాద్‌ జనగర్జన సభ ద్వారా బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీని గెలిపించాలంటూ పిలుపునిచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.

ఆదిలాబాద్‌ జనగర్జన సభలో పాల్గొన్న అమిత్‌షా బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గిరిజన యూనివర్సిటి ఏర్పాటుకు కేసీఆర్‌ సర్కార్‌ భూమి కేటాయించలేదన్నారు. అందుకే యూనివర్సిటీ ఏర్పాటులో జాప్యం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ కృష్ణా ట్రిబ్యునల్‌ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారని చెప్పుకొచ్చారు. అయితే.. సీఎం కేసీఆర్ తన పదేళ్ల పాలనలో పేదల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోకుండా.. కేటీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే డబుల్‌ ఇంజిన్ సర్కార్‌ రావాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. డిసెంబర్‌ 3న తెలంగాణలో కాషాయ జెండా ఎగురాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో సెప్టెంబర్‌ 17ని అధికారికంగా నిర్వహిస్తామని అమిత్‌షా చెప్పారు. కేసీఆర్ కేవలం తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పనిచేస్తున్నారని అన్నారు. కేసీఆర్ తన కుమారుడు, కుమార్తె గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని చెప్పారు. కానీ.. ప్రధాని నరేంద్ర మోదీ దేశం మొత్తం బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్నారు. ఆదివాసీల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని తెలిపారు. అయితే.. ప్రధాని మోదీ పాలనలో ఒక్క అవినీతి మరక లేదన్నారు. తెలంగాణలో మజ్లిల్‌ పార్టీ ఆదేశాలతో బీఆర్ఎస్ పనిచేస్తుందని ఆయన ఆరోపించారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి వచ్చి తెలంగాణ జనగర్జన సభలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. హెలికాప్టర్‌లో ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో ఆయనకు రాష్ట్ర బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. సభ తర్వాత అమిత్‌షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. భాగ్యనగరంలో బీజేపీ నాయకులతో భేటీ అయ్యి.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో పలు సూచనలు చేయనున్నారు కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్‌షా.

Next Story