సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. శ్రీశైలం హైవేపై ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
తెలంగాణలోని నాగకర్నూల్ జిల్లాలోని శ్రీశైలం రహదారిపై ఆదివారం సలేశ్వరం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
By అంజి
సలేశ్వరానికి పోటెత్తిన భక్తులు.. శ్రీశైలం హైవేపై ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
తెలంగాణలోని నాగకర్నూల్ జిల్లాలోని శ్రీశైలం రహదారిపై ఆదివారం సలేశ్వరం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ చెక్‌పోస్ట్ వద్ద టోల్ ఫీజు చెల్లించడంలో జాప్యం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు తెలిపారు. సలేశ్వరం వైపు వెళ్లే వాహనాల నుండి అటవీ శాఖ టోల్ వసూలు చేస్తుంది.
ఈ ఆలస్యం కారణంగా శ్రీశైలం ఘాట్ రోడ్డులో చెక్‌పోస్ట్ నుండి సిద్ధాపూర్ క్రాస్ వరకు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, దీని వలన మహిళలు, పిల్లలు సహా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాలంటీర్లు, అటవీ శాఖ సిబ్బంది ట్రాఫిక్‌ను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి సంవత్సరం.. హిందూ చాంద్రమాన సంవత్సరంలో మొదటి పౌర్ణమి అయిన చైత్ర పూర్ణిమ సందర్భంగా సలేశ్వరం లింగమయ్య స్వామి ఆలయంలో జాతర జరుగుతుంది.
తెలంగాణ అమ్రనాథ్ యాత్రగా పిలువబడే మూడు రోజుల పాటు జరిగే సలేశ్వరం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుండి భక్తులు హాజరవుతారు. ఆదివారం జాతర చివరి రోజు కావడంతో, పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు తరలి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని మల్లికార్జున స్వామి ఆలయం లేదా శ్రీశైలం ఆలయానికి వెళ్లే వందలాది మంది భక్తుల కారణంగా కూడా ఈ సుదీర్ఘ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హనుమాన్ జయంతి, వరుస సెలవుల కారణంగా జాతర, శ్రీశైలం ఆలయంలో జనసమూహం పెరిగింది. అధికారుల ప్రకారం.. అడవిలో, కొండల మధ్య ఉన్న సలేశ్వరం లింగమయ్య స్వామి ఆలయానికి కూడా చాలా మంది భక్తులు ట్రెక్కింగ్ చేస్తున్నారు. వారు దర్శనం చేసుకుంటూ, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఆరవ లేదా ఏడవ శతాబ్దంలో నిర్మించబడిందని భావిస్తున్న ఆలయానికి మూడు నడక మార్గాలు ఉన్నాయి.
యాత్రకు సహకరించాలని ఆలయ అధికారులు ఇప్పటికే భక్తులను కోరారు. అడవిలోకి ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. అడవిలో ఒంటరిగా ప్రయాణించవద్దని భక్తులకు సూచించారు. అధికారులు మద్యపానంపై పూర్తి నిషేధం విధించారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేసవి దృష్ట్యా అడవుల్లో మంటలు సంభవించే అవకాశం ఉన్నందున, భక్తులు అగ్గిపెట్టెలు లేదా ఇతర వస్తువులను తీసుకెళ్లవద్దని ఆదేశించారు.