షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ.. అదే కారణమా?
Alla Ramakrishna Reddy Meet With Sharmila. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల వేగంగా అడుగులు
By Medi Samrat Published on 11 Feb 2021 4:39 PM ISTతెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో.. వైసీపీ ఎమ్మెల్యే, సీఎం జగన్ సన్నిహితుల్లో ఒకరైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. షర్మిల రెండు రోజుల క్రితం పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన థర్డీ డేస్ ప్లాన్ వర్కవుట్ చేస్తున్నారు. ఆమె ఇంటి నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు ఆమె ప్లాన్ చేసుకున్నారు. ఖమ్మంలో నిర్వహించే ఈ ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా గిరిజనులతో షర్మిల ప్రత్యేకంగా భేటీ అవుతారని చెప్పారు. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనకు ఏం చేయాలి అనేదానిపై ఈ సమావేశంలో జిల్లా నేతలతో చర్చించనున్నారు.
ఇప్పటికే నల్గొండ జిల్లా వైఎస్ అభిమానులతో ఆమె సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు, కొత్త పార్టీ పెట్టబోతున్నారనేది దాదాపు ఖాయమే అనే ప్రచారం నడుమ వైఎస్ షర్మిలను వైఎస్ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్ నివాసంలో గురువారం మధ్యాహ్నం ఈ భేటీ జరిగింది. వైఎస్ జగన్‌కు సన్నిహితుల్లో ఒకరైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆయన కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉంది. షర్మిలతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తరపున షర్మిల ప్రచారం కూడా నిర్వహించారు. ఆయనపై పోటీ చేసిన చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై తనదైన శైలిలో విమర్శలు కూడా గుప్పించారు. మరోవైపు షర్మిల రాజకీయ కార్యాచరణతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలను ఎందుకు కలిశారనేది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో షర్మిలతో సమావేశం కావడం ప్రాధాన్యత ఏర్పడింది. జగన్‌కు, షర్మిల పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వస్తున్న ప్రకటన నేపథ్యంలో ఇరువురి భేటీ చర్చనీయాంశంగా మారింది.