సివిల్ లా బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌బాబు.. అన్ని పార్టీల మద్ధతు
తెలంగాణ శాసన సభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన సివిల్ లా బిల్లుకు అన్నీ పార్టీల ఎమ్మెల్యేలు మద్ధతు ప్రకటించారు.
By అంజి Published on 2 Aug 2024 12:15 PM ISTసివిల్ లా బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్‌బాబు.. అన్ని పార్టీల మద్ధతు
తెలంగాణ శాసన సభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన సివిల్ లా బిల్లుకు అన్నీ పార్టీల ఎమ్మెల్యేలు మద్ధతు ప్రకటించారు. సత్వరన్యాయం కోసమే ఈ బిల్లును తెచ్చినట్టు శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నేరాల విచారణ జరుపుతున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడానికి తాము గట్టి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. శాంతి భద్రతల అంశంలో రాష్ట్ర ఖ్యాతిని దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు.
తెలంగాణలో కొత్త హైకోర్టు నిర్మాణానికి రూ.1000 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పటికే రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశామని వెల్లడించారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాల్లో మార్పులు చేర్పులపై అధ్యయనం చేస్తున్నామన్నారు. రాజేంద్రనగర్‌లో ఉన్న అగ్రికల్చర్ వర్సిటీకి మరో చోట స్థలం కేటాయించి, వారి వ్యవసాయ పరిశోధనలకు సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
కాగా సివిల్ కోర్టు సవరణ బిల్లును సమర్ధిస్తూ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెంచాలన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టులకు సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో కోర్టులు నిర్వహించడం బాధాకరమన్నారు. నియోజకవర్గాల్లో జూనియర్ సివిల్ కోర్టులు లేవని, కేసులు సత్వర పరిష్కారం కావాలంటే జూనియర్ సివిల్ కోర్టులు పెంచాలన్నారు. కోర్టుల అంశంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దాలని ప్రభుత్వానికి ఏలేటి సూచించారు.
సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం అందాలన్నారు. సైబర్ క్రైమ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరగా భర్తీ చేయాలని సూచించారు. కేంద్ర చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాలన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిది కాదన్నారు. కొన్ని విషయాల్లో అందరూ కలిసి పని చేయాలని, అత్యాచారాలు, సైబర్ క్రైమ్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడాలని కేటీఆర్ అన్నారు.