ఆలేరు ఎమ్మెల్యేకు హైకోర్టు జరిమానా.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
ఆలేరు ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకురాలు గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్ట్ బిగ్ షాక్ తగిలింది.
By అంజి Published on 26 Sept 2023 12:45 PM ISTఆలేరు ఎమ్మెల్యేకు హైకోర్టు జరిమానా.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
ఆలేరు ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకురాలు గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్ట్ బిగ్ షాక్ తగిలింది. గొంగిడి సునీతకు హైకోర్టు 10 వేల రూపాయల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను చూపకుండా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. గొంగిడి సునీత ఎన్నిక చెల్లదని సైని సతీష్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే పిటిషన్‌లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి అనే వ్యక్తి కూడా ఇంప్లీడ్ అయ్యారు.
2018కి చెందిన కేసులో ఇప్పటివరకూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గొంగిడి సునీతకు రూ.10 వేల జరిమానా విధించింది. అక్టోబరు 3వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎమ్మెల్యే సునీతను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 3 లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే, మరో అవకాశం ఉండదని హైకోర్టు తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఆలేరు అభ్యర్థిగా గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పేరును ఇప్పటికే బీఆర్‌ఎస్ అధిష్ఠానం ప్రకటించింది. 2001, జూన్ 4 న రాజకీయాలలోకి ప్రవేశించి గొంగిడి సునీతా.. మొదట యాదగిరిగుట్ట ఎంపీటీసీగా, యాదగిరిగుట్ట ఎంపీపీగా పనిచేశారు. 2006 నుండి 2011 వరకు వంగపల్లికి సర్పంచ్ గా పనిచేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థైన బూడిద భిక్షమయ్య గౌడ్ పై 34వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018లో అదే నియోజకవర్గం నుండి పోటీచేసి బూడిద భిక్షమయ్య గౌడ్ పై 33086 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.