తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన AICC

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది.

By Srikanth Gundamalla  Published on  15 July 2023 9:02 AM IST
AICC, Telangana, Lok Sabha, observers,

 తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన AICC

తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఏ చిన్న అవకాశం వచ్చినా సువర్ణ అవకాశంగా మార్చుకుని ముందుకు వెళ్తోంది. అంతేకాదు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కాంగ్రెస్ అధిష్టానం. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. అంతేకాదు.. 37 మందితో ఏఐసీసీ ప్రచార కమిటీని కూడా నియమించింది. దీంట్లో పలువురు కీలక నేతలు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాయకులకూ చోటు కల్పించింది. పార్టీలో ఉన్న నాయకులను అందరినీ సంతృప్తి పరిచి.. మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు పదవులను కల్పించి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది.

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. ప్రసాద్ అబ్బయ్య – హైదరాబాద్,ప్రకాష్ రాథోడ్ – ఆదిలాబాద్, శ్రీనివాస్ మనే – భువనగిరి, అల్లం ప్రభు పాటిల్ – చేవెళ్ల, క్రిస్టోఫర్ తిలక్ – కరీంనగర్, అరిఫ్ నసీం ఖాన్ – ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానం పరిశీలకుడిగా పరమేశ్వర నాయక్‌ను నియమించింది ఏఐసీసీ. మోహన్ కుమార మంగళం – మహబూబ్ నగర్, రిజ్వాన్ హర్షద్ – మల్కాజ్ గిరి, బసవరాజ్ మాధవరావు పాటిల్ – మెదక్, పీవీ మోహన్ – నాగర్ కర్నూల్, అజయ్ ధరమ్ సింగ్ – నల్గొండ, సీడీ మేయప్పన్ – జహీరాబాద్, బీఎం.నాగరాజ – నిజామాబాద్ నియమించారు. విజయ్ నామ్దేవ్ రావ్ – పెద్దపల్లి, రుబి ఆర్ మనోహరన్ -సికింద్రాబాద్, వరంగల్ స్థానానికి పరిశీలకులుగా రవీంద్ర ఉత్తంరావు దల్వి నియామకం అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ వారి పేర్లను ప్రకటించింది.

ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న వేళ టీపీసీసీ ప్రచార కమిటీని కూడా ఏఐసీసీ నియమించింది. ఈ కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ను నియమించింది. మాజీ ఎంపీ, ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కమిటీలో చోటు కల్పించింది. కో ఛైర్మన్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలను నియమించింది. పీసీసీ అధ్యక్షుడితోపాటు సీఎల్పీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత, కార్యనిర్వహణ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జాతీయ ఆఫీస్ బేరర్స్, పార్టీకి సంబంధించిన పలు శాఖలు, డీసీసీ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఏఐసీసీ నియమించింది.

Next Story