తెలంగాణ రాష్ట్రంలో భారీ ఇన్వెస్ట్‌మెంట్ చేసేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.10 వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు.. కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ తెలంగాణలో మరో మైలురాయి అన్నారు. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కానుండగా, 3600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా కంట్రోల్ ఎస్ సంస్థ ఇప్పటికే HYDలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.