విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల జీవితాలను సమూలంగా మార్చగలిగే విద్యా వ్యవస్థకు అధికంగా నిధులు కేటాయించాలని, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థులను తయారు చేసుకునేందుకు అవసరమైన సిలబస్, మౌళిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని , భవిష్యత్తులో ప్రపంచానికి మానవ వనరులను అందించాలనే ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లను ప్రారంభించామని అన్నారు.సమాజాన్ని ఎస్సి, ఎస్టీ, బీసీ మైనారిటీ వంటి కులాలకు మతాల పేరుతో విడదీయకుండా ఉమ్మడి కుటుంబంలా అందర్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సమీకృత విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు విద్యను అందించే కార్యక్రమానికి నాంది పలికామని అన్నారు.