అద్దెకు ఇచ్చినా, తాళాలు వేసినా డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గతంలో ఇళ్లు పొంది, వాటిని వినియోగించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న...
By - అంజి |
అద్దెకు ఇచ్చినా, తాళాలు వేసినా డబుల్ బెడ్రూం ఇళ్లు రద్దు.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గతంలో ఇళ్లు పొంది, వాటిని వినియోగించుకోకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి. డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజాహరుద్దీన్‌లతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సమీక్షలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. 2 BHK, జెఎన్ఎన్ యూఆర్ఎమ్ వంటి పథకాల కింద ఇళ్లు పొంది, వాటిలో నివసించకుండా ఇతరులకు అద్దెకు ఇస్తున్న వారిపై, లేదా ఏళ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అలాంటి లబ్ధిదారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. నోటీసులకు స్పందించని పక్షంలో, వారి ఇళ్ల కేటాయింపులను రద్దు చేసి, అర్హులైన ఇతర పేదలకు ఆ ఇళ్లను కేటాయించాలని స్పష్టం చేశారు. ఒకవేళ నోటీసులపై స్పందించిన లబ్ధిదారుల నుండి.. తాము అక్కడే నివాసం ఉంటామని, నిబంధనలు అతిక్రమిస్తే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అంగీకరిస్తూ అండర్ టేకింగ్ తీసుకోవాలని సూచించారు.
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు
హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉండాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకూడదని మంత్రులు స్పష్టం చేశారు.
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం టవర్లు అన్నీ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, ఏ టవర్‌కు ఆ టవర్ పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించారు. కొత్తగా నిర్మించే కాలనీల్లో జిహెచ్ఎంసి సహకారంతో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస వసతులు తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు మరియు నాలుగు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.