PVNR ఎక్స్‌ప్రెస్ వేపై బోల్తా పడ్డ వ్యాన్, ఒకదానినొకటి ఢీకొన్న 5 కార్లు
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పరిధిలో పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ వ్యాన్ బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 9:45 AM ISTPVNR ఎక్స్‌ప్రెస్ వేపై బోల్తా పడ్డ వ్యాన్, ఒకదానినొకటి ఢీకొన్న 5 కార్లు
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పరిధిలో పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఓ వ్యాన్ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్తున్న వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. దాంతో.. వెనకాలే వస్తున్న కార్లు వ్యాన్‌ను ఢీకొట్టాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు కార్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. దాంతో.. పివీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.
రాజేంద్రనగర్ పివీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పైన వెళ్తున్న మినీ గూడ్స్ వ్యాన్ బీభత్సం సృష్టిం చింది. యమ స్పీడ్‌తో వెళ్తున్న ఈ మినీ వ్యాను 148 పిల్లర్స్ నెంబర్ వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు మీద అడ్డంగా పడిపోయింది. దీంతో దాని వెనకాలే వస్తున్న ఐదు కార్లు ఒకదాని వెంబడి మరొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఒక కారు యజమాని ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి కిందికి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తుండగా.. మరో కారు అత్యంత వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన కారు యజమానిని హుటాహుటిన స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటన శంషాబాద్ నుండి మెహదీపట్నం వెళ్తుండగా చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ముందు భాగం, ఒక కారు వెనుక భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. మరో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ సిబ్బంది వ్యాన్ పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.