తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు
దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగారు.
By - Medi Samrat |
దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ఆర్టీఏ చెక్‌పోస్టుల వద్ద అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణ వ్యాప్తంగా పలు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులపై శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఆయా చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ సోదాల సమయంలో లెక్కల్లో చూపని 4,18,880/- రూపాయలు స్వాధీనం చేసుకున్నారు
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పోందుర్తి ఆర్టీఏ చెక్ పాయింట్ దగ్గర అక్టోబర్ 19న అర్థరాత్రి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. వాహనాల నుంచి ప్రైవేటు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ. 51,300 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.
సంగారెడ్డి జిల్లా చిరాగ్ పల్లి మండలం మాడ్గిలోని అంతరాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుపై అర్ధరాత్రి ఏసీబీ అధికారుల దాడి చేశారు.వాహనాల డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఏసీబీ దాడి చేసింది మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 43, 300 నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతరాష్ట్ర చెక్ పోస్టుల పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. బైంసా చెక్ పోస్టులో రూ. 3000 వేల నగదు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ చెక్ పోస్టులో లక్షా 26 వేలు పట్టుకున్నారు అధికారులు. కుమ్రంబీమ్ జిల్లా వాంకిడి చెక్ పోస్ట్ లో రూ. 5100 లు పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఏసీబీ అధికారులు.
మొత్తం 12 జిల్లాల్లోని చెక్ పోస్ట్‌లపై ఏసీబీ దాడులు
1) విష్ణుపురం (వాడపల్లి) RTA చెక్ పోస్ట్, నల్గొండ జిల్లా.
2) కోదాడ్ RTA చెక్ పోస్ట్, సూర్యాపేట జిల్లా.
3) కృష్ణ RTA చెక్ పోస్ట్, నారాయణపేట జిల్లా.
4) భోరాజ్ RTA చెక్ పోస్ట్, ఆదిలాబాద్ జిల్లా.
5) భైంసా RTA చెక్ పోస్ట్, నిర్మల్ జిల్లా.
6) వాంఖిడి RTA చెక్ పోస్ట్, కొమ్రం భీమ్-ఆసిఫాబాద్
7) సలాబత్పూర్-మద్దునూర్ RTA చెక్ పోస్ట్, కామారెడ్డి జిల్లా
8) పెందుర్తి RTA చెక్ పోస్ట్, కామారెడ్డి జిల్లా
9) జహీరాబాద్ RTA చెక్ పోస్ట్, సంగారెడ్డి జిల్లా
10) పాల్వోంచ RTA చెక్ పోస్ట్, భద్రాద్రి-కొత్తగూడెం
11) అశ్వారావుపేట RTA చెక్ పోస్ట్, భద్రాద్రి-కొత్తగూడెం
12) ముత్తుగూడెం (పెనుబల్లి) RTA చెక్ పోస్ట్, ఖమ్మం జిల్లాలో ఏసిబి దాడులు