మెదక్ ప్రభుత్వాసుపత్రిలో ఏసీబీ మెరుపు దాడులు.. రియింబర్స్‌మెంట్ బిల్లుల్లో భారీ అవకతవకలు
మెదక్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించి, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపుల్లో...
By - అంజి |
మెదక్ ప్రభుత్వాసుపత్రిలో ఏసీబీ మెరుపు దాడులు.. రియింబర్స్‌మెంట్ బిల్లుల్లో భారీ అవకతవకలు
మెదక్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించి, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న భారీ అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. ఏసీబీ మెదక్ రేంజ్ అధికారులు జరిపిన ఈ సోదాల్లో రికార్డుల నిర్వహణలో లోపాలు, నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా కనిపించాయి.
మెదక్ ఆసుపత్రిలో పాలనాపరమైన లోపాలు మరియు ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మెడికల్ రీయంబర్స్మెంట్ విభాగంలో డాక్యుమెంటేషన్ అస్తవ్యస్తంగా ఉందని అధికారులు గుర్తించారు. మార్చి 2025 నుండి మార్చి 5, 2026 మధ్య మొత్తం 1,053 బిల్లులు అందగా, కేవలం 529 బిల్లులను మాత్రమే ప్రాసెస్ చేశారు. మిగిలిన బిల్లులను ఆసుపత్రి సూపరింటెండెంట్ వద్దే నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు.
అవుట్‌వర్డ్ రిజిస్టర్‌ను జనవరి 5, 2026 తర్వాత అప్‌డేట్ చేయలేదని అధికారులు గుర్తించారు. నిబంధనల ప్రకారం సంబంధిత శాఖాధిపతులకు పంపాల్సిన బిల్లులను, ఎటువంటి రికార్డులు లేకుండా వ్యక్తులకు విడివిడిగా జారీ చేస్తున్నట్లు తేలింది. మెడికో-లీగల్ కేసులకు (MLC) సంబంధించి 2026 జనవరి, ఫిబ్రవరి నెలల్లో 156 కేసులు నమోదయ్యాయి. అయితే, వీటిలో ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేశారనే విషయంలో ఆసుపత్రి వద్ద సరైన లెక్కలు లేకపోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది.
స్థానిక ఫార్మసీ విక్రేతలతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా గత ఏడాది కాలంలో సుమారు ₹50.87 లక్షల విలువైన మందులు, ఇతర వైద్య సామాగ్రిని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు పాటించారా లేదా అన్న కోణంలో ఏసీబీ ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది విషయంలోనూ అవకతవకలు బయటపడ్డాయి. విధులకు గైర్హాజరైన ఆరుగురు సిబ్బందికి హాజరు వేసినట్లు అధికారులు గుర్తించారు.
ఈ అక్రమాలకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు ఏసీబీ తెలిపింది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరింది.