ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ ఛార్జిషీట్.. A1గా కేటీఆర్
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసు నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కీలక అడుగు వేసింది.
By - అంజి |
ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ ఛార్జిషీట్.. A1గా కేటీఆర్
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసు నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కీలక అడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఫార్ములా-ఈ రేసు నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఏసీబీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (ఏ2), హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి (ఏ3), స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు (ఏ4)లతో పాటు యూకేకు చెందిన ఎఫ్ఈఓ (FEO) సంస్థను ఏ5గా చేర్చారు.
సుమారు రూ.55 కోట్లను ఆర్బీఐ నిబంధనలు అతిక్రమించి విదేశీ సంస్థలకు మళ్లించారని, ఇందులో భారీ కుట్ర దాగి ఉందని ఏసీబీ అభియోగపత్రంలో వివరించింది. ఈ వ్యవహారంలో 'క్విడ్ ప్రోకో' (ప్రతిఫలంగా ప్రయోజనం పొందడం) జరిగిందని ఏసీబీ గట్టిగా నమ్ముతోంది. ఫార్ములా-ఈ ఆపరేషన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న 'ఏస్ నెక్స్ట్ జెన్' సంస్థకు ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగించారని, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి భారాసకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.45 కోట్లు అందాయని ఏసీబీ ఆరోపిస్తోంది. నిధుల దుర్వినియోగం, మోసం, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఏసీబీతో పాటు ఈడీ (Enforcement Directorate) కూడా విచారణ జరుపుతోంది.
కేసు నేపథ్యం , పరిణామాలు
2023 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ వద్ద జరిగిన మొదటి ఫార్ములా-ఈ రేసు తర్వాత, రెండో సీజన్ నిర్వహణ కోసం కుదుర్చుకున్న ఒప్పందాలే వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. హెచ్‌ఎండీఏ బోర్డు నిధుల నుంచి రూ.160 కోట్లు మంజూరు చేయడం, అందులో భాగంగా సుమారు రూ.45.71 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ చేయడం నిబంధనలకు విరుద్ధమని తేలింది. దీనిపై ఐటీ శాఖ ఇదివరకే హెచ్‌ఎండీఏకు రూ.8.07 కోట్ల జరిమానా కూడా విధించింది. గవర్నర్ మరియు డీవోపీటీ అనుమతుల కోసం వేచి చూసిన ఏసీబీ, ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగడంతో ఈ సమగ్ర ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.