ఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ తయారీకి ఓ అరుదైన ప్రాజెక్ట్
విద్యుత్ కోసం రకరకాల ప్రాజెక్టులను ప్రభుత్వాలు చేపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విండ్, టైడల్, సోలార్ ఎనర్జీ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఉన్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Aug 2024 3:30 PM ISTఆదిలాబాద్ జిల్లాలో విద్యుత్ తయారీకి ఓ అరుదైన ప్రాజెక్ట్
విద్యుత్ కోసం రకరకాల ప్రాజెక్టులను ప్రభుత్వాలు చేపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విండ్, టైడల్, సోలార్ ఎనర్జీ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఉన్నాయి. పలు ప్రాంతాలలో కారిడార్ లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా విద్యుత్ తయారీకి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. రాబోయే కొన్నేళ్లలో, తెలంగాణలోని సుందరమైన కొండ ప్రాంతాల నుండి విద్యుత్‌ను పొందే అవకాశం ఉంది. పర్యావరణంపై తక్కువ ప్రభావం చూపే ‘ఆఫ్ స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజీ’ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల స్థాపన కోసం ప్రైవేట్ రంగం నుండి ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలు:
ఆఫ్ స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌ను ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఝరి గ్రామంలోని కొండల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్ట్‌లో అవసరమైన కొన్ని ప్రాథమిక పనులు ఇప్పటికే పూర్తి కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సవివరమైన సాధ్యాసాధ్యాల నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల అధికారులను కోరింది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి నీటి లభ్యత జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
రూ. 4,700 కోట్లకు పైగా అంచనా వేసిన ఈ ప్రాజెక్ట్, 750 MW (4,545 MWh) కరెంట్ ఉత్పత్తిని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రధాన భాగాలలో.. మూల ప్రవాహానికి దూరంగా రెండు స్టోరేజ్ ట్యాంకుల (ఒక్కొక్కటి 845 మీటర్ల పొడవు)ను నిర్మించడం, నిల్వ చేయబడిన నీటిని నిరంతరం సైక్లింగ్ చేయడం వంటివి డెడ్రా ఫారెస్ట్ బ్లాక్‌లో ప్రతిపాదించారు.
ఎగువ ట్యాంక్ 0.381 tmcft స్థూల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ప్రత్యక్ష నిల్వ 0.320 tmcft కాగా, డెడ్ స్టోరేజీ 0.161 tmcft ఉంటుంది. అదే విధంగా దిగువ ట్యాంక్‌లో 0.352 టీఎంసీఎఫ్‌టీ నిల్వ ఉండేలా డిజైన్ చేస్తారు. ఈ ట్యాంక్ ప్రత్యక్ష నిల్వ 0.327 tmcft, డెడ్ స్టోరేజీ 0.025 tmcft కంటే తక్కువగా ఉంటుంది.
మత్తయివాగు ప్రాజెక్టు
విద్యుదుత్పత్తి ఎలా జరుగుతుందో ఒక ఉన్నత నీటిపారుదల శాఖ అధికారి వివరించారు. మొదట రుయ్యాడి స్థానిక కొండ ప్రవాహం నుండి నీటిని వర్షాకాలంలో దిగువ ట్యాంక్‌లోకి పంప్ చేస్తామన్నారు. దిగువన ఉన్న మత్తయివాగు ప్రాజెక్టును నింపేందుకు అవసరమైన 0.57 టీఎంసీల నీరు కాకుండా ప్రవాహంలో పుష్కలంగా నీరు ఉన్నట్లు అందుబాటులో ఉన్న సమాచారం సూచిస్తుంది. “ఇది రుయ్యాడి ప్రవాహం నుండి 0.414 టిఎంసిఎఫ్‌టి నీటిని ఒకేసారి డ్రా చేయడం. బాష్పీభవనం వల్ల కలిగే నష్టాలను పూడ్చుకోవడానికి తర్వాతి సంవత్సరాల్లో చాలా తక్కువ పరిమాణంలో నీరు మాత్రమే అవసరమవుతుంది, ”అని అధికారి సూచించారు.
దిగువ ట్యాంక్ నుండి నీటిని పగటిపూట ఎగువ ట్యాంక్‌కు పంపిస్తారు. అక్కడ నుండి గరిష్ట డిమాండ్ సమయంలో విద్యుత్ ఉత్పత్తి టర్బైన్‌కు ప్రవాహంలో విడుదల చేస్తారు. ఈ రకమైన ప్రాజెక్ట్ చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ప్రాజెక్ట్ కాన్సెప్ట్ సమాచారం ప్రకారం, రెండు ట్యాంకులు, ఇతర అనుబంధ యూనిట్ల నిర్మాణానికి అవసరమైన భూమి 319.5 హెక్టార్లు. ఇందులో 212 హెక్టార్లు అటవీ భూమి కాగా 107.5 హెక్టార్లు అటవీయేతర భూమి.
3.5 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి:
ప్రభుత్వం నిర్దేశించిన షరతులకు లోబడి అవసరమైన సర్వేలను నిర్వహించడానికి గ్రీన్‌కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు రాష్ట్ర, కేంద్ర అటవీ శాఖలు అనుమతినిచ్చాయి. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అంచనా వేసిన సమయం 3.5 సంవత్సరాలు. స్ట్రీమ్ ప్రక్రియ కంటే ఆఫ్-స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పవర్ ఉత్పత్తి ఉత్తమమని ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.
మూలాధారాల ప్రకారం, నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు, కుమ్రం భీమ్ ఐఫాబాద్ జిల్లాలోని కుమ్రం భీమ్ ప్రాజెక్టుకు సమీపంలో ఆఫ్ స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తిని కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలని యోచిస్తోంది. ఈ రెండు ప్రాంతాలు కొండ ప్రాంతాలు. కాబట్టి.. ఈ ప్రాజెక్టు రూపం దాలిస్తే రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి కూడా జోరందుకోనుంది.