బస్సులో జనాలు ఎక్కువై ఊపిరాడక వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో గురువారం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 28 March 2024 2:39 PM GMTబస్సులో జనాలు ఎక్కువై ఊపిరాడక వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం. ఇది అందరికీ తెలిసిందే. కొన్ని రూట్లలో బస్సులు అవసరమైనన్ని అందుబాటులో లేకపోవడంతో బస్సులు రద్దీగా ఉంటాయి. దాంతో.. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు. దూర ప్రయాణం చేయాల్సి వున్నా.. గంటల కొద్దీ నిలబడే ఉండాల్సి వస్తుంది. అయితే.. తాజాగా జగిత్యాల జిల్లాలో కూడా ఓ బస్సు ఫుల్ ప్యాక్ అయిపోయింది. అసలే ఎండాకాలం.. దాంతో ఊపిరాడక ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో గురువారం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్‌కు చెందిన బోగం సాంబయ్య (65) అనే వ్యక్తి పనిమీద మెట్‌పల్లికి వెళ్లాడు. గురువారం తిరిగి నిజామాబాద్‌కు పయణమయ్యాడు. దీంట్లో భాగంగానే హుజూరాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఎక్కాడు. ఆ రూట్లో బస్సులు తక్కువగా ఉన్నాయో.. లేదంటే గురువారం జనాలు ఎక్కువగా వచ్చారో తెలియదు కానీ.. సామర్థ్యానికి మించి ప్రయాణికులు అందులో ఎక్కారు. అసలే ఒకవైపు ఎండలు దంచికొడుతున్నాయి. ఉక్కపోతతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక మరోవైపు బస్సులో కెపాసిటీకి మించిన జనాలు ఎక్కడంతో సాంబయ్య ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వెంకట్రావుపేట సమీపంలోకి రాగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
సాంబయ్య పరిస్థితిని గమనించిన బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు వెంటనే బస్సును పక్కకు ఆపించారు. అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చారు సిబ్బంది. అతన్ని అంబులెన్స్‌లు మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. అయితే.. సాంబయ్యను పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మరణించినట్లు తెలిపారు.