నవ మాసాలు మోసి రెండు నెలల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. బిడ్డను కంటికి రెప్పలా పెంచి, పెద్ద ప్రయోజకురాలిని చేయాలని కలలుగంది. అంతా బాగానే ఉందనుకునేలోపే ఆ తల్లి అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు కొన్ని మందులు రాసిచ్చి.. ఇవి వాడితే సమస్య తగ్గిపోతుందంటూ ఇంటికి పంపించారు. ఈ క్రమంలోనే బిడ్డకు పాలిస్తూ ఆ తల్లి తనువు చాలించింది. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లిలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజాపూర్ మండలం తిర్మలపూర్ గ్రామానికి చెందిన జయశ్రీ (25) కాన్పు కోసం నేరళ్లపల్లిలోని పుట్టినింటికి వచ్చింది. రెండు నెలల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని రోజుల కిందట జయశ్రీ అస్వస్థతకు గురైంది. దీంతో భర్త ప్రశాంత్ తిర్మాలపూర్ వచ్చి జయశ్రీని శనివారం మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమె గుండె వాల్వులో చిన్న సమస్య ఉందని, మందులు వాడితే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో మళ్లీ నేరళ్లపల్లికి తీసుకొచ్చాడు.
నిన్న ఉదయం 5.30 గంటల సమయంలో జయశ్రీ తన బిడ్డకు పాలిస్తూ మృతి చెందింది. ఆ కాసేపటికి టీ కోసం కుటుంబ సభ్యులు పిలిచినా ఆమె లేవలేదు. అనుమానంతో పరిశీలించగా జయశ్రీ మృతి చెందినట్లు గుర్తించి హతశయులయ్యారు. మృతురాలి తల్లిదండ్రులు, అత్తమామలు తీర్థయాత్రలకు తమిళనాడు వెళ్లడంతో.. వృద్ధులు వెంటనే ఆమె భర్తకు సమాచారమిచ్చారు.