నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్యనగర్‌లోని టీ మార్ట్ సూపర్ మార్కెట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. దీంతో సూపర్ మార్కెట్‌లో వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని టీమార్ట్ యజమానీ శేఖర్ తెలిపారు.
గతంలో ఈ మార్ట్‌కు పార్టనర్‌లుగా ఉన్న వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. సూపర్ మార్కెట్‌ను తమ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టనర్‌షిప్‌లో పెట్టుకున్నామని శేఖర్ చెప్పారు. ఇది వాళ్లు చేసిన పనే అని అనుమానంగా ఉందన్నారు. ఎందుకంటే తమకు వాళ్లకు గొడవలు జరుగుతున్నాయన్నారు. సీపీ ముందు తనకు వార్నింగ్ కూడా ఇచ్చారని, తాను ఇప్పటికే ఒకసారి ఫిర్యాదు ఇచ్చానని, ఇక వాళ్లే చూసుకుందామన్నారని చెప్పారు. ఇప్పుడు ఇలా చేశారని శేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటలో ముగ్గురి పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.