హైదరాబాద్: రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద 'విహారి' ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకుని బయటకి దూకారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు సిబ్బంది త్వరగా అలర్ట్ కావడం, ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు వెంట వెంటనే బస్సు దిగిపోయారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది.
అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 29 మంది ఉన్నారు. వారంతా సురక్షితంగా బయపడ్డారు. కాగా ఇటీవల కర్నూలులో వి.కావేరి బస్సు దగ్ధం కావడంతో అందులో 19 మంది ప్రయాణికులు చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇటీవల సంగారెడ్డిలోని చేవెళ్లలో ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 19 మంది మృతి చెందారు. వరుస ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలను పెంచుతున్నాయి.