రిలయన్స్ ఫౌండేషన్ పేరుతో ఫేక్ లెటర్ కలకలం.. ఆ ఒక్క అక్షరాన్ని మార్చి..
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ పేరుతో ఫేక్ లెటర్ కలకలం రేపింది.
By అంజి Published on 4 Aug 2023 1:15 PM ISTరిలయన్స్ ఫౌండేషన్ పేరుతో ఫేక్ లెటర్ కలకలం.. ఆ ఒక్క అక్షరాన్ని మార్చి..
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ పేరుతో ఫేక్ లెటర్ కలకలం రేపింది. పలు కాలేజీల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తామంటూ అధికారులకు వచ్చిన ఫేక్ లెటర్ హాట్ టాపిక్‌గా మారింది. రిలయన్స్ ఫౌండేషన్ పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా పలు కాలేజీల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని సుబ్బారావు, గౌతమ్‌రెడ్డి అనే వ్యక్తులు రిలయన్స్ ఫౌండేషన్ పేరుతో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ సీఈఓ జయప్రద, డిప్యూటీ డైరెక్టర్ ఎం.లక్ష్మారెడ్డిలను సంప్రదించారు. సంస్థ సీఎస్‌ఆర్ ఇన్‌ఛార్జి ఎలిజిబెత్ సంతకాలను ఫోర్జరీ చేసిన లెటర్లను వారికి అందజేశారు.
సదరు అధికారులు ఆయా లేఖలను విద్యాశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌కు పంపారు. ఆ లెటర్ నిజమని నమ్మిన విద్యా శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ మొత్తం కాలేజీల లిస్టుకి సంబంధించిన నివేదికను తయారు చేసి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్‌కి పంపించారు. విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ రాసిన లెటర్‌ను చూసిన రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. తాము ఎలాంటి హామీ ఎవరికి ఇవ్వలేదని రిలయన్స్ ప్రతినిధులు స్పష్టం వ్యక్తం చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ కు విషయం తెలియజేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు దీన్ని ఫేక్ లెటర్ గా గుర్తించారు.
అటు రిలయన్స్ ఐటీ సిబ్బంది లెటర్‌ను పరిశీలించగా.. ఇంగ్లీష్ లెటర్స్‌లోని 'రిలయన్స్'లో వచ్చే 'సీ' లెటర్‌ను తొలగించి 'ఎస్' లెటర్‌తో లేఖను రూపొందించి ఇటు విద్యాశాఖను, ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ ఫేక్ లెటర్ రాసిన వారిపై రిలయన్స్ ప్రతినిధి సచిన్ యశ్వంత్ వెంటనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి.. రంగంలోకి దిగి ఫేక్ లెటర్ క్రియేట్ చేసిన ఇద్దరిని గుర్తించారు. ఇప్పటికే ఏపీలో ఇదే కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. సుబ్బారావు, గౌతమ్ రెడ్డిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.