రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

A 9-year-old boy died of a heart attack in Rajanna Sirisilla district. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన బుర్ర కౌశిక్ గౌడ్ అనే తొమ్మిదేళ్ల బాలుడు ప్రభుత్వ పాఠశాలలో

By అంజి  Published on  26 Oct 2022 7:52 AM GMT
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి

హర్ట్ ఎటాక్.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరికి.. ఎలా.. వస్తుందో చెప్పలేం. చాలా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా గుండెపోటుతో మరణించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుల్లో వృద్ధులు, మధ్య వయస్కులతో పాటు యువతలో కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుందని విన్నాం. కానీ.. అప్పటిదాకా సరదాగా.. హుషారుగా ఉన్న తొమ్మిదేళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందడం అందరినీ కలిచివేసింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో చోటుచేసుకుంది.

వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన బుర్ర కౌశిక్ గౌడ్ అనే తొమ్మిదేళ్ల బాలుడు ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. మొన్న దీపావళి కావడంతో రాత్రి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగను చాలా సంతోషంగా జరుపుకున్నాడు. అతను కూడా ఉత్సాహంగా పటాకులు కాల్చాడు. ఉదయం లేచి ఎప్పటిలాగే స్కూల్‌కి వెళ్లాడు. ఉదయం క్లాసులన్నీ విని కౌశిక్ అందరితో కలిసి భోజనానికి వెళ్ళాడు. చేతిలో ప్లేటు పట్టుకుని స్నేహితులతో కలిసి లైన్‌లో నిల్చున్నాడు. అప్పటి వరకు అందరితో సరదాగా గడిపిన కౌశిక్ ఒక్కసారిగా క్యూలో కుప్పకూలిపోయాడు.

గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయులు స్పందించి కౌశిక్‌ను గ్రామ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితిని గమనించిన వైద్యుడు కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కౌశిక్‌కు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. ఆస్పత్రికి తరలించేలోపే కౌశిక్ మృతి చెందాడని తెలిపారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎంతో హుషారుగా బడికి వెళ్లిన కొడుకు విగతజీవిగా తిరిగి రావడం చూసి గుండె తరుక్కుపోయింది. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన కౌశిక్ ఇక లేడని తెలిసి.. అతని తోటివిద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారి గుండెపోటుతో మృతి చెందిందని తెలిసి గ్రామమంతా కన్నీరుమున్నీరైంది.

గుండెపోటు లక్షణాలు

ఎవరికైనా ఎడమ వైపు లేదా మధ్యలో ఛాతీ నొప్పి.. దవడ, ఎడమ వైపు మెడ నొప్పి వచ్చే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అర్థం. గుండె వాల్స్‌కు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలకు తగినంత రక్త ప్రవాహం లేనప్పుడు ఈ లక్షణాలు సంభవిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. గుండెలో మంటగా అనిపిస్తే గ్యాస్ సమస్యగా భావించి ట్యాబ్లెట్లు వేసుకుని.. ముందస్తు హెచ్చరికలు చేసినా పట్టించుకోకపోయినా సమస్య తీవ్రంగా మారి తరచూ గుండెపోటుకు దారి తీస్తుంది. కొన్ని అనారోగ్య కారణాల వల్ల.. గుండె విపరీతంగా పంపింగ్ అవుతుంది. గుండె దడ అనిపించినా.. పరీక్షలు చేయించుకోవడం మంచిది. మీరు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే.. ఏ వయసులో, ఎప్పుడు, ఎలా, ఎందుకు, గుండెపోటు వస్తుందో చెప్పడం కష్టంగా మారింది.

Next Story