Siddipet: స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థిని.. కారణమిదే
సిద్దిపేట జిల్లా జిల్లా మిర్‌దొడ్డి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.
By అంజి Published on 4 Oct 2023 6:06 AM GMTSiddipet: స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థిని.. కారణమిదే
సిద్దిపేట జిల్లా జిల్లా మిర్‌దొడ్డి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. పాఠశాల భవనం మొదటి అంతస్తు పైనుంచి కిందకు దూకింది. విద్యార్థినిని సిద్ధిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజాంపేట్‌కి చెందిన రక్షిత.. కస్తూర్బా స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. కొద్ది రోజులుగా హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేదని బాధపడుతూ తోటి విద్యార్థులతో తరచూగా చెబుతూ ఉండేదని స్కూల్ స్పెషల్ ఆఫీస్ స్వర్ణలత తెలిపారు. మంగళవారం నాడు మధ్యాహ్నం రక్షిత స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి దూకింది. ఇది గమనించిన తోటి విద్యార్థినులు, వెంటనే టీచర్లకు సమాచారం ఇచ్చారు.
మొదట మిరుదొడ్డిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేసిన తరవాత.. రక్షితని సిద్దిపేట జిల్లాలోని ఆస్పత్రికి తరలించారు. రక్షిత తల్లి తండ్రులిద్దరూ ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ కారణంగా కూతురు చదువు కొనసాగించడం కోసం.. ఆమెను హాస్టల్‌లో ఉంచారు. మొదటి నుంచి తల్లిదండ్రులకు దూరంగా ఉండటం ఇష్టం లేదని, ఎప్పుడూ తల్లి తండ్రుల గురించే ఆలోచిస్తూ మదనపడేదని అని తోటి విద్యార్థినిలు చెప్పారు. దీంతో చదువుపై ఎప్పుడు ఏకాగ్రత పెట్టలేకపోయేది అని టీచర్లు చెప్పుకొచ్చారు. ఆమె మనసు మార్చడానికి కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పాము అని స్పెషల్ ఆఫీసర్ స్వర్ణలత తెలిపారు. అయితే విద్యార్థిని రక్షిత ఇలాంటి నిర్ణయానికి పాల్పడుతుంది అని తాము ఊహించ లేకపోయామని పేర్కొన్నారు. ఈ ఘటనతో పాఠశాలలోని విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.