తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గురువారం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 59,297 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 887 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,08,776కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1701కి చేరింది. కరోనా నుంచి మరో 337 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,01,564గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,511 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,166 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 201, మేడ్చల్‌లో 79, నిర్మల్‌లో 78, రంగారెడ్డిలో 76, జగిత్యాల జిల్లాలో 56 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. కాగా.. ఇప్పటి వరకు తెలంగాణలో 1,02,10,906 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.