తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73.01% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

By -  Knakam Karthik
Published on : 12 Feb 2026 6:25 AM IST

Telangana Municipal Elections, Polling Percentage, State Election Commission

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్

తెలంగాణలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73.01% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 116 మున్సిపాలిటీల్లో దాదాపు 75.88% పోలింగ్ జరిగింది. ఏడు కార్పొరేషన్ల పరిధిలో 66.05 శాతం పోలింగ్ నమోదు కాగా, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓటింగ్ జరిగింది. అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. అదే సమయంలో, అత్యల్పంగా నందికొండ మున్సిపాలిటీలో 59.68 శాతం పోలింగ్ నమోదైంది.

ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అయితే, క్యూ లైన్లలో నిల్చున్న వారికి రాత్రి 7 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,203 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కొన్ని చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా, పోలింగ్ ప్రక్రియ మొత్తం ప్రశాంత వాతావరణంలో సాగింది. వృద్ధులు, వికలాంగులకు పోలీసులు సహాయం అందించి ఓటు వేయించారు. ఈ ఎన్నికల్లో 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 14న మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నిక, ఫిబ్రవరి 16న వారి ప్రమాణ స్వీకారం ఉంటాయి.

Next Story