యాదగిరి గుట్టలో కరోనా కలకలం
68 staffers at Telangana's Yadadri Sri Lakshmi Narasimha Temple test COVID positive. యాదగిరి గుట్ట దేవాలయంలోని అర్చకులు సహా మొత్తం 68 మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
By Medi Samrat
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో కరోనా కలకలం రేగడంతో అధికారులు కాస్తా అప్రమత్తమయ్యారు. దేవాలయంలోని అర్చకులు సహా మొత్తం 68 మంది ఉద్యోగులు, సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, ప్రత్యేక కరోనా వైరస్ పరీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించినా, వెంటనే నమూనాలు ఇచ్చి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఘటన తరువాత ఆలయంలో నిత్యాన్నదానాన్ని నిలిపివేశారు. భక్తుల సమక్షంలో స్వామివారికి జరిగే ఆర్జిత సేవలను రద్దు చేసి, లఘు దర్శనాలను మాత్రమే అమలు చేస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 403 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిచింది. ఒక్కరోజులో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 313 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,742 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,00,469 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,690గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,583 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణచట్టంలోని 51 నుండి 61 వరకు గల సెక్షన్ల కింద.. అదేవిధంగా ఐపీసీ 188తో పాటు ఇతర సెక్షన్ల కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. మాస్క్ నిబంధన కచ్చితంగా అమలు అయ్యేలా చూడాలని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. ప్రజల్లో మార్పు కనిపించడం లేదు. చాలా చోట్ల మాస్కులు లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఫైన్లు పడుతున్నా కూడా లైట్ తీసుకుంటూ ఉన్నారు.