ఖమ్మంలో 66 డెంగ్యూ కేసులు నమోదు

66 dengue cases reported so far in Khammam. ఖమ్మం జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి

By అంజి  Published on  4 Aug 2022 3:51 PM GMT
ఖమ్మంలో 66 డెంగ్యూ కేసులు నమోదు

ఖమ్మం జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇది డెంగ్యూ దోమలు విజృంభించే సమయమని, దోమలు వృద్ధి చెందకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని, నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

డ్రై డే, పారిశుధ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని జిల్లాలోని ప్రజాప్రతినిధులకు అజయ్‌కుమార్‌ సూచించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని, డ్రైడే ప్రక్రియను పటిష్టంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ తెలిపారు. 2019లో దాదాపు 2000 డెంగ్యూ పాజిటివ్ కేసులు, 2020లో 23 కేసులు, 2021లో 944 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో 2022లో ఇప్పటివరకు దాదాపు 66 కేసులు నమోదయ్యాయని, పాజిటివ్‌ కేసు నమోదైన చుట్టుపక్కల 50 ఇళ్లలో ఉంటున్న వ్యక్తుల నమూనాలను పరీక్షించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

జిల్లాలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేవారు, సిబ్బందికి టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 19,012 మంది నమూనాలు సేకరించగా వారిలో 487 టైఫాయిడ్‌ పాజిటివ్‌గా తేలింది. జిల్లాలో అవసరమైన అన్ని మందులు స్టాక్‌లో ఉన్నాయని తెలిపారు.

Next Story
Share it