హైదరాబాద్: ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల భర్తీలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ఠ వయోపరిమితిలోనూ ఐదేళ్లు మినహాయింపు ఇచ్చింది. 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్, 5 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది. అంధత్వం, చెవుడు, మానసిక వైకల్యం, బధిరులు, మరుగుజ్జులు, యాసిడ్ బాధితులు, ఆటిజం, కండరాలు సరిగా పని చేయని వారిని 5 కేటగిరీలుగా విభజించనుంది.
దృష్టి లోపం ఉంటే.. ఏ కేటగిరీ, వినికిడి లోపం, మూగ ఉంటే.. బీ కేటగిరీ, అంగవైకల్యం ఉంటే.. సీ, మానసిక వైకల్యం ఉంటే.. డీ, ఒకటికి మించిన వైకల్యాలు ఉంటే.. ఈ. ఈ విధంగా ఐదు కేటగిరీలుగా విభజించింది. ఈ కేటగిరీల అభ్యర్థులకు విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఒక్కో శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేయనున్నారు. ఈ రిజర్వేషన్ రొటేషన్ కింద కొనసాగుతుంది.
అంటే.. ఒక కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థికి ఆ అవకాశం కల్పిస్తారు. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. అటు ప్రవేశాల్లో దివ్యాంగులే లేకుంటే ఆ ఖాళీలను సంబంధిత రిజర్వ్‌డ్ వర్గాల్లోని సాధారణ అభ్యర్థులతో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు.