మంత్రి జగదీష్‌ రెడ్డిపై 48 గంటల నిషేధం.. ఆ ప్రసంగం వల్లే..

48-hour campaign ban on Minister Jagadish Reddy. మంత్రి జగదీష్‌ రెడ్డిపై 48 గంటల నిషేధం.. ఆ ప్రసంగం వల్లే..

By అంజి  Published on  30 Oct 2022 11:22 AM IST
మంత్రి జగదీష్‌ రెడ్డిపై 48 గంటల నిషేధం.. ఆ ప్రసంగం వల్లే..

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం 48 గంటల ప్రచార నిషేధం విధించింది. అలాగే ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించకూడదని మంత్రి జగదీశ్‌రెడ్డికి సూచించింది. అలాగే ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆదేశించారు. మంత్రి జగదీష్‌ రెడ్డి చేసిన ప్రసంగాలు ఓటర్లను బెదిరించే విధంగా ఉన్నాయని ఈసీ వెల్లడించింది. ఐదు రోజుల క్రితం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు.

పింఛను రావద్దనుకుంటే నరేంద్ర మోదీకి ఓటు వేయాలని ఓటర్లకు మంత్రి సూచించారు. సంక్షేమ పథకాలు, పింఛన్లు కొనసాగాలంటే కేసీఆర్‌కు ఓటేయాలని కోరారు. దీనిపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రసంగంపై ఈసీ శనివారం నోటీసులు జారీ చేసింది. మంత్రి జగదీశ్‌ సమర్పించిన వివరణతో సంతృప్తి చెందని ఈసీ.. ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈసీ తీసుకున్న చర్యలపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఈసీ ప్రవర్తిస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి.


Next Story