తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అడ్డాకుల పొన్నకల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో 21 వీధి కుక్కలను చంపేశారు. అనేక ఇతర కుక్కలు గాయపడినట్లు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిల్లర్లు మొత్తం గ్రామంలో (జాతీయ రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న) వీధి కుక్కలను లేకుండా చేశారు. గుర్తు తెలియని నలుగురు దుండగులు ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్కులు వేసుకొని గ్రామంలోకి ప్రవేశించి తుపాకితో 20 కుక్కలను కాల్చి చంపేశారని సమాచారం.
చనిపోయిన కుక్కలకు పశుసంవర్ధక శాఖ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అడ్డాకుల ఎస్‌ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''విషమిచ్చి కాల్చి చంపి ఉంటారని అనుమానిస్తున్నాం. వారు దేశీ ఆయుధాలను ఉపయోగించి ఉండవచ్చు. గ్రామంలో సీసీ కెమెరాలు లేవు, రహదారిపై కూడా లేవు. ఇప్పుడు కెమెరాలను అమర్చమని నేను వారిని కోరాను'' అని అన్నారు.
ఆయుధాల చట్టం, జంతు హింస చట్టం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు అనుమానితులను గుర్తించలేదు. కుక్కలను చంపడం వెనుక ఉద్దేశం ఇంకా తెలియరాలేదు. ఖాళీ కాట్రిడ్జ్‌లను గుర్తించిన పోలీసులు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. “రెండు కుక్కలు కాల్చకుండానే చనిపోయాయి. విషం వల్ల మాత్రమే చనిపోవచ్చు. ఇతర కుక్కలకు విషం ఇచ్చి కాల్చి ఉండవచ్చు” అని పోలీసులు తెలిపారు. శవపరీక్ష తర్వాత కుక్కలను ఖననం చేశారు.