జనగాం జిల్లా దేవరుప్పుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో (కెజిబివి) గురువారం రాత్రి వారికి వడ్డించిన దోసకాయ చట్నీని తిని 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఆహారంలో బల్లి అవశేషాలు కనిపించాయి. విద్యార్థులను వెంటనే చికిత్స నిమిత్తం జనగాం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గురువారం రాత్రి తమకు వడ్డించిన ఆహారం తిన్న తర్వాత విద్యార్థినులు వికారం, కడుపునొప్పితో ఫిర్యాదు చేశారు.
కేర్‌టేకర్, ఉపాధ్యాయులు సమాచారం ఇవ్వకపోయినప్పటికీ, విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకున్నారు. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికలు తమకు వడ్డించిన చట్నీలో చేపల మాంసం కలిపారని మొదట భావించారు. కానీ వెంటనే చట్నీలో చనిపోయిన బల్లి ఉన్నట్లు వారు గ్రహించారు. వాంతులు చేసుకోవడంతో విద్యార్థినులను జనగాం ఆస్పత్రికి తరలించారు. గత రెండు నెలల్లో జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. సెప్టెంబరులో, వర్ధన్నపేటలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో బల్లి ఉన్న ఆహారం తిన్న సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సిహెచ్ శివ లింగయ్య ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ''విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనపై ఆరా తీస్తున్నాం. హాస్టల్ నుంచి ఆహార నమూనాలు సేకరించారు. మెస్ కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. దేవరుప్పుల కస్తూర్బా పాఠశాలలో బల్లి పడిన ఆహారం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. మునుగోడు పర్యటనలో ఉన్న ఆయన అన్నంలో బల్లి రావడం పై విచారం వ్యక్తం చేశారు.