హైదరాబాద్‌ : తెలంగాణలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తెల్లవారుఎ జాము నుంచే బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. రోజు నడిచే బస్సులు కూడా ఈ రోజు నడవలేదు. 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెకు మద్దతుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు సహా, విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నాయి. మరోవైపు ..బంద్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది.

బస్సులపై దాడి…అద్దాలు ధ్వంసం
పలుచోట్ల ఆందోళనకారులు బస్సులపై రాళ్లతో దాడి చేశారు. నిజామాబాద్ జిల్లా మక్లూర్‌ మండలంలో బస్సులపై దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు.

కోదండరామ్‌ అరెస్ట్, సీపీఐ నేతలు అరెస్ట్
ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రొఫెసర్ కోదండరామ్‌ బంద్‌లో పాల్గొన్నారు. జూబ్లీ బస్ స్గాండ్ దగ్గర ఆయన సమ్మెలో పాల్గొన్నారు. పోలీసులు కోదండరామ్‌ను అరెస్ట్ చేశారు. బొల్లారం పీఎస్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ఇక..పలువురు టీడీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Image result for TELANGANA BANDH

పోలీసుల పర్యవేక్షణలో…
ప్రభుత్వం వేలాది మంది పోలీసులను మోహరించినప్పటికీ…ఒక్క బస్సు కూడా డిపో దాటి బయటకు రాలేదు. అయితే..ఇప్పుడిప్పుడే డిపోల నుంచి బస్సులు బయటకు వస్తున్నాయి. పూర్తి పోలీసుల రక్షణలో బస్సులు ముందుకు కదులుతున్నాయి. తెలంగాణ బంద్ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అయినా..ఇంకా డిపోల దగ్గర ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇంకా ఉద్రిక్తలే..!!

తెలంగాణ అంతట  తీవ్ర ఉద్రిక్తలు  నెలకొన్నాయి. దాదాపుగా అన్ని ఉద్యోగ సంఘాలు బంద్ కు మద్దతు తెలిపాయి. దీంతో..బంద్ విజయవంతమైందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ రోజు ఎలాగైనా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.