సొమ్మొకరిది సోకొకరిది – రాజ్యమేలుతున్న ఇసుక మాఫియా

By రాణి  Published on  24 Jan 2020 10:11 AM GMT
సొమ్మొకరిది సోకొకరిది – రాజ్యమేలుతున్న ఇసుక మాఫియా

ముఖ్యాంశాలు

  • తెలంగాణలో ఇసుక కో ఆపరేటివ్ సొసైటీలు నామమాత్రమే
  • మొత్తం పవరంతా పూర్తిగా నేతలు, కాంట్రాక్టర్ల చేతిలోనే
  • కొన్ని సొసైటీలకు కమిటీలు కూడా లేని దీనమైన పరిస్థితి
  • లైసెన్సులు మాత్రం గిరిజన కో ఆపరేటివ్ సొసైటీలకు
  • అసలు రాజ్యమేలుతోంది మాత్రం ఇసుక మాఫియా
  • కనీసం యాన్యువల్ ఆడిట్ లెక్కలుకూడా ఇవ్వని సొసైటీలు

పేరుకు ఇసుక సొసైటీల పేర్లు, స్థానిక గిరిజనుల పేర్లు మాత్రం కనిపిస్తాయి. కానీ ఊరుమాత్రం మొత్తంగా స్థానిక రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లదే. ఇసుకను బండ్లలో నింపుకెళ్లే విషయంలో మొత్తం పెత్తనమంతా పూర్తిగా వాళ్లదే. ఉదాహరణకు ములుగు జిల్లాను తీసుకుందాం. ఈ జిల్లాలో 60 ట్రైబల్ శాండ్ సొసైటీలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాగితాల మీద మాత్రం ఈ సొసైటీలకు మాత్రమే ఇసుకను తవ్వుకునే అధికారం ఉంటుంది. కానీ ఏనాడూ ఒక్క ఇసుక రేణువునుకూడా ఈ సొసైటీలు ముట్టుకుని ఎరగవంటే ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ఎందుకంటే సబ్ కాంట్రాక్టర్లే వీళ్లకు ఇచ్చిన పర్మిట్లను పూర్తిగా ఉపయోగించుకుంటారన్న విషయం మొత్తం అందరికీ తెలిసిందే.

ఒక్క ములుగు జిల్లాలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉందనుకుంటే మళ్లీ పూర్తిగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ నిజం అందరికీ తెలిసిందే. కానీ దీని గురించి మాట్లాడేందుకు మాత్రం ఎవరూ సాహసించరు. ఎందుకంటే ఇసుక మాఫియాతో పెట్టుకుంటే పుట్టగతులుండవన్న సంగతికూడా వాళ్లకు చాలా స్పష్టంగా తెలుసుకాబట్టి. గిరిజన ప్రాంతాల్లో ఇసుకను తవ్వుకోవడానికి, అమ్ముకోవడానికి ఖచ్చితంగా కేవలం గిరిజనులకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని కఠినతరమైన ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కానీ అవి అమలుకావడంలో మాత్రం పూర్తిగా ఫెయిలవుతున్నాయి. ఏటూరు నాగారంలో ఇలాంటి అవకతవకల్ని భారీ స్థాయిలో గుర్తించి, రూల్స్ ని అతిక్రమించినవారికి నేరుగా ప్రభుత్వ అధికారులు నోటీసులుకూడా జారీ చేశారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు ఉండదు.

ఆడిట్ లెక్కల్లో పూర్తిగా విఫలం

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జిల్లా కోఆపరేటివ్ సొసైటీ ఒకటో అరో మినహాయించి అసలు ఈ శాండ్ సొసైటీల లెక్కల్ని ఆడిట్ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని పలువులు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ఇసుక సొసైటీల్లో ఒకటో రెండో తప్పితే సంవత్సరాంతంలో సమర్పించాల్సిన ఆడిట్ లెక్కల్ని సమర్పించిన పాపాన పోనేలేదు. ఏటూరులోని సమ్మక్క గ్రామప్రజల ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ విషయంలో అయితే మరీ విచిత్రం. ఈ సొసైటీకి లైసెన్స్ మంజూరు చేసేనాటికి అసలు ఎన్నిక కాబడిని కమిటీకూడా లేదని స్థానికులు చెబుతున్నారు. నేరుగా కలెక్టర్ ఛాంబర్ లోనే ఈ ఎన్నికకు సంబంధించిన సమావేశం జరిగిందని అధికారులు పుస్తకాల్లో రాసేసుకున్నారు.

వందలాదిమంది కలెక్టర్ కార్యాలయంలో...అందునా కలెక్టర్ ఛాంబర్ లో ఎలా మీటింగ్ పెట్టుకుంటారో, కమిటీని ఎలా ఎన్నుకుంటారో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఒకవేళ లైసెన్స్ ఇచ్చినా పర్యావరణానికి సంబంధించిన అనుమతులను పొందడానికి ఒక్కటంటే ఒక్క సొసైటీ కూడా ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. స్థానిక గిరిజనుల పేరుతో కాంట్రాక్టర్లు, స్థానిక నేతలు పూర్తి స్థాయిలో స్థానిక వనరులను కొల్లగొడుతున్నారనడం నిర్వివాదాంశం. అక్టోబర్ 2015లో దీనికి సంబంధించి నేరుగా ఓ పిటిషన్ కూడా దాఖలయ్యింది. స్థానిక గిరిజనుల పేరుతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కంపెనీ నేరుగా నిబంధనలను అతిక్రమించి బాహాటంగా క్వారీ లైసెన్స్ ని దక్కించుకోవడానికి బినామీ పేర్లతో దరఖాస్తు పెట్టుకుందనీ, దానికి క్వారీలు మంజూరయ్యాయనీ స్థానికులు చెబుతున్నారు.

2015 మార్చ్ 10వ తేదీన కమలాపూర్ కి చెందిన సమ్మయ్య అనే స్థానిక గిరిజనుడు ఇసుక మాఫియా అవకతవకలకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో జిల్లా కలెక్టర్ కు రాతపూర్వకంగా ఓ ఫిర్యాదును సమర్పించాడు. ఇంతవరకూ దానిపై విచారణ జరిగిన దాఖలాలే లేవు. ఇకపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందన్న ఆశలు ఏమాత్రం లేవని స్థానికులు అంటున్నారు. గోదావరిలో ఇసుకను తవ్వి తీసుకోవడం, అమ్ముకోవడం లాంటి పనులన్నీ పూర్తి స్థాయిలో అంగబలం, అర్థబలం ఉన్నవాళ్లు చేతుల్లోనే ఉన్నాయన్న విషయం అధికారులకు కూడా తెలిసిన విషయమే. కానీ అందరూ చెప్పే సమాధానం ఒక్కటే. క్వారీలనుంచి ఇసుకను తవ్వి తీసుకోవడానికి అవసరమైన యంత్రాలు స్థానిక గిరిజనుల దగ్గర లేవన్నదే ఆ సమాధానం. కానీ నిజానికి ఇసుక క్వారీల్లోంచి ఇసుకను తవ్వి తీయడానికి యంత్రాలను వాడకూడదన్న కఠినమైన నిబంధన అమల్లోనే ఉంది. కానీ ఆ నిబంధనను స్థానిక నేతలు, కాంట్రాక్టర్లు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా యంత్రాల సాయంతోనే ఇసుకను తవ్వితీసి బండ్లకెత్తి అమ్మేసుకుంటున్నారు.

అంగబలం, అర్థబలం ఉన్నవాళ్లదే పూర్తిగా రాజ్యం

ఖచ్చితంగా స్థానిక గిరిజనులకు మాత్రమే ఇసుకను తవ్వుకోవడానికి లైసెన్స్ ఇవ్వాలని ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1998 స్పష్టంగా చెబుతోంది. కానీ అమలులో మాత్రం ఇది ఎక్కడా కనిపించిన దాఖలాలు లేనేలేవు. 2018లో ప్రొఫెసర్ జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలోకూడా సరళమ్మ ఇసుక సొసైటీమీదకూడా ఇలాంటి అభియోగాలతోకూడిన ఫిర్యాదు అధికారులకు అందింది. కానీ చర్యలు శూన్యం. కంఠానపల్లిలో ఇసుక మాఫియాని నేరుగా అక్కడి టిఆర్ఎస్ నేత కుమారుడు కబ్జాలో పెట్టుకున్నాడనీ, అతని మాటకు ఎదురు చెప్పడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదనీ స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు ఇక్కడ సొసైటీలు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్న దాఖలాలుకూడా లేవు. స్థానిక గిరిజనులు నిరక్షరాస్యులు కనుక సంవత్సరాంతంలో లెక్కలు పత్రాలకు సంబంధించిన ఆడిట్ వివరాలను జిల్లా కోఆపరేటివ్ సొసైటీకి సమర్పించే అంశం గురించి అసలు ఆలోచించే పనేలేదు. గిరిజనుల నిరక్షరాస్యత, అమాయకత్వం, విధిలేని పరిస్థితులు, నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి, జీవనం గడుపుకోవడానికీ తప్పని పరిస్థితుల్లో బలం, బలగం ఉన్న వాళ్ల చేతుల్లో చిక్కుకోక తప్పని పరిస్థితి, సొంతగా నిర్ణయాలు తీసుకోలేని అశక్తత లాంటి అనేక కారణాలు గిరిజనులకు కేటాయించిన క్వారీలను ప్రైవేట్ మాఫియా చేతుల్లోకి నెట్టేస్తున్నాయని అధికారులు అంటున్నారు.

Next Story